ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వర్చువల్ విధానంలో ఒకేసారి 9 వందేభారత్ రైళ్లను జెండా ఊపి ప్రారంభించారు. ప్రస్తుతం ఇండియాలో 25 వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌లు పరుగులు పెడుతున్నాయి. ఇవాళ్టి 9తో కలిపి.. ఈ సంఖ్య 34కి పెరిగింది. ఈ రైళ్ల ప్రారంభంతో.. దేశంలో కనెక్టివిటీ మరింత పెరిగి… పర్యాటక రంగం అభివృద్ధికి మేలు జరుగుతుందని ప్రధాని మోదీ అన్నారు. దేశంలో రవాణా వ్యవస్థ.. ఇతర రంగాలకు సహాయపడేలా.. మల్టీ మోడల్ వ్యవస్థలను అభివృద్ధి చేస్తున్నామన్నారు. అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 1న దేశంలోని ప్రజలంతా.. ఉదయం 10 గంటలకు స్వచ్ఛతా కార్యక్రమంలో పాల్గొనాలని ప్రధాని మోదీ కోరారు.
భారతీయ రైల్వేను ఆధునికీకరించడమే లక్ష్యంగా బడ్జె్ట్‌లో భారీగా నిధులు కల్పిస్తున్నట్లు మోదీ తెలిపారు. దేశంలో వేల రైల్వేస్టేషన్లు, స్వాతంత్ర్యం వచ్చిన 50 ఏళ్ల తర్వాత కూడా బాగుపడలేదన్న మోదీ.. ఇప్పుడు ఆ దిశగా చాలా ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. ఒకటే భారత్, శ్రేష్ఠమైన భారత్ లక్ష్యంతో అడుగులు వెయ్యాలనీ, 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా భారత్ అవతరించాలని మోదీ ఆకాంక్షించారు. ఈ కొత్త రైళ్లు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, గుజరాత్, రాజస్థాన్, ఒడిశా, బీహార్, జార్ఖండ్, బెంగాల్ రాష్ట్రాల్లో ప్రజలకు ఇవాళ్టి నుంచి సేవలు అందిస్తాయి.