మ. 1.30 నుంచి స్పోర్ట్స్ 18లో..
ఇండోర్: స్టార్ ఆటగాళ్లు విశ్రాంతిలో ఉన్నా టీమిండియా తొలి వన్డేలో అదరగొట్టింది. ఆస్ట్రేలియా జట్టుపై అన్ని విభాగాల్లోనూ పైచేయి సాధించింది. ఇక ఇక్కడి హోల్కర్ స్టేడియంలో ఆదివారం జరిగే రెండో మ్యాచ్‌లోనూ నెగ్గి సిరీస్‌ను పట్టేయాలన్న పట్టుదలతో ఉంది. ఆఖరి మ్యాచ్‌కు విరాట్, రోహిత్, హార్దిక్, కుల్దీప్ రానున్నారు. కాబట్టి యువ ఆటగాళ్ల సత్తాకు రెండో మ్యాచ్ ఆఖరి అవకాశం కానుంది.
శ్రేయాస్, అశ్విన్‌పై ఒత్తిడి: తొలి మ్యాచ్‌లో భారత్ చాలావరకు సంతృప్తికర ఫలితాలను సాధించినా.. పలు ప్రశ్నలకు సమాధానాలు అలాగే ఉన్నాయి. ముఖ్యంగా శ్రేయాస్ అయ్యర్ పరిస్థితి టీమ్ మేనేజ్మెంట్కు అర్థం కాకుండా ఉంది. తొలి వన్డేలో లేని పరుగు కోసం వెళ్లి రనౌటయ్యాడు. వచ్చే రెండు మ్యాచ్‌ల్లో అతను వీలైనన్ని పరుగులు చేయాల్సి ఉంది. అశ్విన్ చాలా కాలం తర్వాత వన్డేల్లో బౌలింగ్ చేసినా ఫ్లాట్ ట్రాక్‌పై అతను చేసేదేమీ లేకపోయింది.
అక్షర్ ఫిట్‌గా లేకపోతే చివరి నిమిషంలోనైనా మెగా టోర్నీలో ఆడే చాన్సుంది కాబట్టి అశ్విన్‌కు కూడా మిగిలిన ఈ రెండు వన్డేలు కీలకమే. ఒకవేళ సుందర్‌కు ఆదివారం చాన్సిస్తే రుతురాజ్ బెంచ్‌కే పరిమితం కానున్నాడు. శార్దూల్ పది ఓవర్లలో 78 పరుగులిచ్చుకోవడం ఆందోళనకరం. బ్యాటిం గ్లో సూర్యకుమార్ ఎట్టకేలకు వన్డే ఫోబియాను అధిగమించాడు. బౌలింగ్‌లో బుమ్రాకు రెస్ట్ ఇచ్చి సిరాజ్‌ను ఆడించవచ్చు. ఇక, ఆసీస్ నుంచి కూడా మ్యాక్స్‌వెల్, స్టార్క్, హాజెల్వుడ్లాంటి కీలక ఆటగాళ్లు ఆడలేదు. హాజెల్‌వుడ్ ఈ మ్యాచ్‌లో ఆడే చాన్సుంది.