AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

నేడు హైదరాబాద్-బెంగళూరు వందేభారత్ ప్రారంభం..

హైదరాబాద్- బెంగళూరు మధ్య ప్రయాణాలు సాగించేవారికి గుడ్‌న్యూస్. నేడు ఈ రెండు నగరాల మధ్య వందే భారత్ ట్రైన్ ప్రారంభం కానుంది. ప్రధాని మోదీ ఢిల్లీ నుంచి ఇవాళ ఒకేసారి 9 వందే భారత్ ఎక్స్‌ప్రైస్ ట్రైన్లను వర్చువల్‌గా ప్రారంభిస్తుండగా.. అందులో కాచిగూడ (హైదరాబాద్)- యశ్వంత్‌పుర్ (బెంగళూరు) ట్రైన్ కూడా ఉంది. ఈ ట్రైన్ ఏపీ మీదుగా కర్ణాటకకు వెళ్లనుంది. అంటే మూడు రాష్ట్రాలను ఈ ట్రైన్ కలపనుంది. నేడు ప్రారంభం కానున్న ట్రైన్.. రేపటి నుంచి (సెప్టెంబర్ 25) ప్రయాణికులకు అందుబాటులోకి రానుంది.

కాచిగూడ-యశ్వంత్‌పుర్‌ వందేభారత్‌లో 8 కోచ్‌లు ఉంటాయి. రైలులో 530 మంది ప్రయాణించేందుకు సీట్లున్నాయి. టికెట్ల బుకింగ్‌ సదుపాయం ప్రారంభం కాగా.. ఒక ప్రయాణికుడికి క్యాటరింగ్‌ ఛార్జీలతో కలిపి- ఏసీ ఛైర్‌కార్‌ ధర రూ.1,600గా నిర్ణయించారు. ఎగ్జిక్యూటివ్‌ టికెట్‌ ధర రూ.2,915 గా ఉంది. క్యాటరింగ్‌ వద్దనుకుంటే ఏసీ ఛైర్‌ కార్‌ టికెట్‌ రూ.1,255, ఎగ్జిక్యూటివ్‌ టికెట్‌ రూ.2,515గా నిర్ణయించారు.

ఈ రెండు నగరాల మధ్యదూరం 610 కి.మీ దూరం కాగా ప్రయాణానికి 8.30 గంటల సమయం పడుతుంది. కాచిగూడ-యశ్వంత్‌పుర్‌ వందేభారత్‌ మార్గం మధ్యలో నాలుగు స్టేషన్లలో ఆగుతుంది. కాచిగూడలో ఉదయం 5.30కి ట్రైన్ బయల్దేరుతుంది. మహబూబ్‌నగర్‌ 6.49 గంటలకు, కర్నూలు 8.24 గంటలకు, అనంతపురం 10.44 గంటలకు, ధర్మవరం 11.14 గంటలకు, యశ్వంత్‌పుర్‌కు మధ్యాహ్నం 2 గంటలకు చేరుకుంటుంది.

తిరుగు ప్రయాణంలో బెంగళూరులో మధ్యాహ్నం 2.45 గంటలకు బయలుదేరి రాత్రి 11.15 గంటలకు హైదరాబాద్ చేరుకుంటుంది. బుధవారం మినహా వారంలో 6 రోజులు ఈ వందేభారత్‌ సేవలు అందుబాటులో ఉంటాయి. సెలవు రోజును రైలు నిర్వహణకు వినియోగిస్తారు. కాచిగూడ స్టేషన్‌లో జరిగే ట్రైన్ ప్రారంభం కార్యక్రమానికి గవర్నర్‌ తమిళిసై, సీఎం కేసీఆర్‌, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి తదితరులకు ఆహ్వానాలు పంపినట్లు రైల్వే అధికారులు తెలిపారు.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10