కేంద్రపాలిత ప్రాంతంగా హైదరాబాద్?
త్వరలో ప్రకటించనున్న కేంద్రం
సోషల్ మీడియాలో జోరుగా చర్చ
తెలంగాణకు గుండెకాయ లాంటి హైదరాబాద్ నగరాన్ని కేంద్ర పాలిత ప్రాంతంగా మార్చేస్తారా? పెద్ద మొత్తంలో ఆదాయాన్ని సమకూరుస్తోన్న భాగ్యనగరాన్ని రాష్ట్రం నుంచి వేరు చేస్తారా..? అవునో కాదో తెలియదు కానీ.. సోషల్ మీడియాలో మాత్రం జోరుగా చర్చ జరుగుతోంది. హైదరాబాద్‌ను యూటీ చేస్తారంటూ చాలా మంది సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. కేంద్రం నుంచి స్పష్టమైన ప్రకటన వస్తేనే ఇలాంటి ప్రచారాన్ని నమ్మాల్సి ఉంటుంది. లేకపోతే అప్పటి వరకూ దాన్ని పట్టించుకోనక్కర్లేదు.
‘మోదీ సర్కారు హైదరాబాద్ నగరాన్ని కేంద్రపాలిత ప్రాంతంగా చేయనుంది. త్వరలోనే ఇందుకు సంబంధించిన ప్రకటన వెలువడనుంది. ఇప్పటికే కిషన్ రెడ్డి రంగంలోకి దిగి కంటోన్మెంట్ అధికారులతో మాట్లాడారు. 2024 జూన్ నుంచి హైదరాబాద్ యూటీగా మారే అవకాశం ఉంది’.. ఇదీ సోషల్ మీడియాలో కొద్ది రోజలుగా జరుగుతోన్న చర్చ. పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలంటూ మోదీ సర్కారు ప్రకటన చేసిన దగ్గర్నుంచి ఈ ప్రచారం ఊపందుకుంది. హైదరాబాద్‌తోపాటు ముంబై, బెంగళూరు, చెన్నై నగరాలను యూటీ (యూనియన్ టెరిటరీ – కేంద్రపాలిత ప్రాంతం)గా చేస్తారనే టాక్ నడుస్తోంది.
నిజాం స్టేట్ 1948 సెప్టెంబర్ 17న భారతదేశంలో విలీనమైన సంగతి తెలిసిందే. హైదరాబాద్‌ను యూటీ అవుతుంది అంటూ ప్రతి ఏటా సెప్టెంబర్ నెలలో సోషల్ మీడియాలో కొందరు ప్రచారం చేస్తుంటారు. ఈసారి ఈ ప్రచారం మరింత ఎక్కువగా జరుగుతోంది. కేంద్రం నుంచి ఎలాంటి ప్రకటనా లేకపోయినా సరే.. అదిగో పులి అంటే ఇదిగో తోక అన్నట్టుగా.. ఒకర్ని చూసి మరొకరు.. తమకు తోచిన రీతిలో సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఏది ఏమైనా కేంద్రం మనసులో ఏముందో ముందు ముందు కాలమే వెల్లడిస్తుంది. ఒక వేళ నిజంగా కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంటే నగర ప్రజలు హర్షిస్తారా? లేక తిరస్కరిస్తారా? లేకపోతే మరో పోరాటానికి తెలంగాణ సిద్ధమవుతుందా? అన్న దానిపై సందేహం లేకపోలేదు. అంతే కాదు పోరాటాలకు మారుపేరైన తెలంగాణ సమాజం మరోసారి ఏకమవుతుంది అనడంలో సందేహం లేదు.