మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు ఆసక్తికర వ్యాఖ్యలు..
టీడీపీ నాయకత్వ సమస్య ఏమీ లేదన్నారు మాజీ మంత్రి, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు చింతకాయల అయ్యన్నపాత్రుడు. జగన్ ప్రభుత్వం ఎంత మందిని అరెస్టు చేసినా నష్టం లేదన్నారు. రాష్ట్ర ప్రజల భవిష్యత్ కోసం నారా బ్రాహ్మణిని ముందుపెట్టి పార్టీని నడిపిస్తామంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో రాక్షస రాజ్యం నడుస్తోందని.. చంద్రబాబుని అక్రమంగా అరెస్టు చేసి జైల్లో పెట్టారని గుర్తు చేశారు. త్వరలో లోకేష్‌ని కూడా అరెస్టు చేస్తారని ప్రచారం జరుగుతుందని.. లోకేష్ కనుక అరెస్టు అయితే బ్రాహ్మణి నాయకత్వంలో పార్టీ నడుస్తుంది అన్నారు. టీడీపీలో నాయకత్వానికి డోకా ఎన్నడూ లేదని.. వారం రోజులుగా వేలాది మంది మహిళలు రోడ్ల మీదకు స్వచ్ఛందంగా వస్తున్నారన్నారు. ఎవరూ పిలవకపోయినా ఏంటీ అన్యాయం అంటూ బాధపడుతూ వస్తున్నారని.. ఎన్ని ఒడిదుడుకులు ఎదురైన తగ్గేదే లేదన్నారు.
రాష్ట్రంలో ప్రభుత్వం చేస్తున్న అరాచకాలు, చంద్రబాబు అక్రమ అరెస్టుపై జాతీయ మీడియాకు వివరించేందుకు.. రాజ్‌ఘాట్‌లో గాంధీ సమాధి వద్ద దీక్ష చేయాలనే ఉద్దేశంతో ఢిల్లీ వెళ్లామన్నారు. త్వరలో లోకేష్‌ను అరెస్టు చేయనున్నారనే విషయం అక్కడ చర్చకు వచ్చిందని.. చంద్రబాబు లాంటి వ్యక్తినే జైల్లో పెట్టిన వ్యక్తి తమలాంటి వారిని వదలరన్నారు. తామంతా సిద్ధంగానే ఉన్నామని.. చంద్రబాబు, లోకేష్ జైల్లో ఉంటే పార్టీ పరిస్థితి ఏమిటని పలువురు నేతలు ఆందోళన వ్యక్తం చేశారన్నారు. ఎన్నికలకు ఎలా సిద్ధమవ్వాలి, గ్రామాల్లో ఎలా తిరగాలనే సందేహాలు వచ్చాయన్నారు. ఇది ఎన్టీఆర్ స్థాపించిన పార్టీ అని, గతంలో ఎన్ని ఒడుదొడుకులు వచ్చినా నిలబడ్డామన్నారు. దుర్మార్గపు ప్రభుత్వం నుంచి పార్టీని బతికించుకోవాలన్నారు. బ్రాహ్మణి పార్టీని ముందుండి నడిపిస్తారని.. ఇది తన మనసులో మాట అన్నారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు అనే ఆయుధంతో జగన్‌కు రాజకీయ సమాధి కట్టడం ఖాయమన్నారు.