రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో సీపీఐ, సీపీఐ(ఎం) కలిసే పోటీ చేస్తాయని ఆయా పార్టీల రాష్ట్ర కార్యదర్శులు కూనంనేని సాంబశివరావు, తమ్మినేని వీరభద్రం చెప్పారు. అయితే ఏయే సీట్లలో పోటీ చేయాలనే దానిపై చర్చించామన్నారు. అవి ఇంకా కొలిక్కి రాలేదని అన్నారు. వచ్చేనెల ఒకటిన మళ్లీ సమావేశాన్ని నిర్వహించాలని నిర్ణయించామని వివరించారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడిగా పోటీ చేసే సీట్లపై చర్చించి ఆ నిర్ణయాన్ని ప్రకటిస్తామని చెప్పారు. హైదరాబాద్లోని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యాలయం ఎంబీ భవన్లో గురువారం సీపీఐ, సీపీఐ(ఎం) రాష్ట్ర నాయకుల ఉమ్మడి సమావేశాన్ని నిర్వహించారు. ఇందులో సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం. కేంద్ర కమిటీ సభ్యులు చెరుపల్లి సీతారాములు, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి, పోతినేని సుదర్శన్, జావ్వెస్లీ, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకటిరెడ్డి, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు కలవేణి శంకర్, హేమంత్ కుమార్ తదితరులు పాల్గన్నారు. అనంతరం మీడియాతో తమ్మినేని, కూనంనేని మాట్లాడారు.
మహిళా బిల్లును వెంటనే అమలు చేయాలి
తమ్మినేని వీరభద్రం మాట్లాడుకూ మహిళా బిల్లు వెంటనే అమల్లోకి వచ్చేలా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. జనగణన, నియోజకవర్గాల పునర్విభజన తర్వాత అమలు చేయడమంటే ఎన్నికల్లో లబ్దికోసమే మహిళా బిల్లును తెచ్చినట్టుగా ఉందన్నారు. మహిళలను ఉద్దరించే ఉద్దేశం మోడీ ప్రభుత్వానికి లేదని విమర్శించారు. మహిళా బిల్లులో ఓబీసీ కోటా ఉండాలన్నారు.
కాంగ్రెస్ తో పొత్తు అంశం చర్చకు రాలేదు: కూనంనేని
కాంగ్రెస్ తో పొత్తు అంశం చర్చకు రాలేదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు చెప్పారు. అయితే ఆ పార్టీతో తాము పొత్తు వద్దనుకోవడం లేదని స్పష్టం చేశారు. కాంగ్రెస్ సీట్లు ఇస్తుందంటూ ఊహాగానాలు వద్దనీ, కలిసి మాట్లాడినప్పుడు చర్చ వస్తుందన్నారు. ప్రస్తుతానికి వచ్చే ఎన్నికల్లో సీపీఐ, సీపీఐ(ఎం) కలిసి పోటీ చేస్తాయనీ, సీట్ల విషయంలో వచ్చేనెల ఒకటిన మరోసారి చర్చించి ఉమ్మడి అభ్యర్థులను ప్రకటిస్తామన్నారు. అంగనవాడీ కార్మికులపై పోలీసులు దాడి చేయడం సరైంది కాదన్నారు. సమ్మె చేస్తే కొడతారా? అని ప్రశ్నించారు. సమ్మె చేస్తే ఉద్యోగంలోకి తీసుకోబోమంటూ ప్రభుత్వం చెప్పడం దారుణమని అన్నారు.
