హైదరాబాద్: ఖైరతాబాద్ మహా గణపతిని దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు. 63 అడుగుల్లో పర్యావరణహితమైన మట్టి గణపతి భక్తులను కనువిందు చేస్తోంది. ఖైరతాబాద్ మహాగణపతికి తొలిపూజలో గవర్నర్ తమిళిసై, హర్యానా గవర్నర్ దత్తాత్రేయ, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్యే దానం నాగేందర్ తదితరులు పాల్గొన్నారు.
వినాయక చవితి సందర్భంగా పెద్ద సంఖ్యలో భక్తులు ఖైరతాబాద్ వినాయకుడి దర్శనానికి తరలివస్తున్నారు. తెల్లవారుజాము నుంచే భక్తుల తాకిడి అధికంగా ఉంది. కళాకారుల ఆటపాటలతో ఖైరతాబాద్ సందడిగా మారింది. ఈ ఒక్క రోజే లక్ష మంది భక్తులు దర్శించుకునే అవకాశం ఉంది. మరోవైపు ఖైరతాబాద్ గణేష్‌కు పద్మశాలి సంఘం 125 అడుగుల కండువాను సమర్పించింది.
ఈ ఏడాది శ్రీ దశవిద్య మహాగణపతిగా ఖైరతాబాద్ వినాయకుడు భక్తులకు దర్శనమిస్తున్నారు. మొత్తం 63 అడుగుల మట్టి గణపతిని ఏర్పాటు చేశారు. కుడివైపు పంచముఖ లక్ష్మీ నరసింహస్వామి.. ఎడమవైపు వీరభద్ర స్వామి విగ్రహాలు ఉన్నాయి. ఉత్సవ కమిటీ సభ్యులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకొని బారీకేడ్లు, క్యూలైన్లను ఏర్పాటు చేశారు. పోలీసు ఉన్నతాధికారులు భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించారు.









