భారీ సంఖ్యలో ఊపందుకుంటున్న చేరికలు
కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానం పలుకుతున్న కేఎస్‌ఆర్
పెద్ద ఎత్తున కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న కేఆర్‌కే కాలనీవాసులు
ఆదిలాబాద్: కాంగ్రెస్‌లోకి కంది శ్రీనివాసరెడ్డి రాకతో పార్టీలో కొత్త జోష్ వచ్చింది. ఆయన సమక్షంలో భారీ సంఖ్యలో చేరికలు ఊపందుకోవడంతో పూర్వవైభవం కన్పిస్తోంది. ఆదిలాబాద్ అభివృద్ధిని కాంక్షిస్తూ చేస్తున్న సేవా కార్యక్రమాలు, ప్రజల సంక్షేమం కోసం స్థానిక ఎమ్మెల్యే జోగు రామన్నను ప్రశ్నిస్తున్న తీరుకు ఆకర్షితులై పెద్దఎత్తున కాంగ్రెస్ పార్టీలోకి వస్తున్నారు. మే వెంటే మేమున్నాంటూ ఆయన వెంట నడుస్తున్నారు. దీంతో ఎన్నడూలేని విధంగా కాంగ్రెస్‌లోకి వలసలు వస్తున్నారు. ఆదిలాబాద్ పట్టణంలోని కేఆర్‌కే కాలనీలో గల తవక్కల్ ఫంక్షన్‌హాలులో వార్డు నెంబర్ 7, 8 కాలనీవాసులు షేక్ షాహిద్,షేక్ తమ్ముర్ ఆధ్వర్యంలో భారీ ఎత్తున కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారికి కంది శ్రీనివాసరెడ్డి కండువాలు కప్పి ఆహ్వానం పలికారు. కాంగ్రెస్ పార్టీతోనే అభివృద్ధి సాధ్యమవుతుందని అన్నారు. ప్రతీ కార్యకర్త కాంగ్రెస్ మేనిఫెస్టోను ప్రజల్లోకి తీసుకెళ్లి పార్టీ గెలుపునకు శక్తివంచన లేకుండా కృషి చేయాలని పిలుపునిచ్చారు. స్థానిక ఎమ్మెల్యే జోగు రామన్న తీరుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రామన్న హయాంలో ఆదిలాబాద్ ప్రజలకు తీరని అన్యాయం జరిగిందన్నారు. ప్రజలకు ఇప్పటివరకు ఎలాంటి మేలు చేకూరలేదన్నారు. లేనిపోని అబద్ధపు హామీలతో 15 సంవత్సరాలుగా ప్రజలను మోసం చేస్తున్నారని ఆరోపించారు.
గతంలో కాంగ్రెస్ పార్టీ మాత్రమే ప్రజలకు ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చిందని గుర్తు చేశారు. తిరిగి కాంగ్రెస్ పార్టీతోనే మళ్లీ ఆదిలాబాద్ ప్రగతిపథంలో దూసుకెళ్తుందని జోస్యం చెప్పారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం నిర్మించిన డబుల్ బెడ్ రూం ఇండ్లలో ఎలాంటి నాణ్యత ప్రమాణాలు పాటించలేదన్నారు. వాటిని ఏ ఒక్కరికీ కూడా కేటాయించలేదని అన్నారు. అవి తంతే కూలిపోయే విధంగా ఉన్నాయని విమర్శించారు. ఇలాంటి ఎమ్మెల్యేను చిత్తు చిత్తుగా ఓడిరచాలని పిలుపునిచ్చారు. తన ఫౌండేషన్ ఆధ్వర్యంలో చేస్తున్న సేవా కార్యక్రమాలను అడ్డుకునేందుకు జోగు రామన్న కుట్రలు పన్నుతున్నారని ధ్వజమెత్తారు. ఆడబిడ్డలకు ఓ అన్నలాగా ప్రెషర్ కుక్కర్లను కానుకగా అందింస్తుంటే గోదామును సీజ్ చేయించాడని మండిపడ్డారు.
జోగు రామన్న ఎన్నికుట్రలు పన్నినా ఆదిలాబాద్ ప్రజల నుంచి తనను దూరం చేయలేరన్నారు. ఓటమి భయం పట్టుకుంది కాబట్టే కుట్ర రాజకీయాలకు తెరలేపుతున్నారన్నారు. రాబోయే ఎన్నికల్లో ప్రజలే ఆయనకు తగిన రీతిలో బుద్ధిచెబుతారని హితవు పలికారు. అంతకుముందు కాలనీకి చేరుకున్న ఆయనకు పార్టీ శ్రేణులు, కాలనీవాసులు టపాసులు కాల్చి ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు ఐనేని సంతోష్రావు, భరత్ వాగ్మారే, షకీల్, డేరా కృష్ణారెడ్డి, నాగర్కర్ శంకర్, కిజర్ పాషా, సుజాత్ అలీ, కొండూరి రవి, ముఖీమ్, అంజద్ ఖాన్, కర్మ, అస్బాత్ ఖాన్, అల్లూరి అశోక్ రెడ్డి, పుండ్రు రవి కిరణ్ రెడ్డి, సంతోష్ రెడ్డి, బండి కిష్టన్న, బాసా సంతోష్, హరీష్ రెడ్డి, మహమూద్, కాలనీవాసులు సయ్యద్ ఖలీల్, మహమూద్ ఖాన్, షేక్ సాజిద్, కృష్ణ, అశోక్, షేక్ సుల్తాన్, షేక్ అహ్మద్, షేక్ సాధక్ అలీ, షేక్ నూరి, అలీష, నజియా, రంజన, షేక్ అంజుమ్, తదితరులు పాల్గొన్నారు.