ఆసియా కప్ లో సూపర్-4లో భాగంగా ఇండియాతో జరిగిన మ్యాచ్ లో పాకిస్థాన్ చిత్తుగా ఓడిపోయిన సంగతి తెలిసిందే. ఏకంగా 228 పరుగులు తేడాతో పరాజయం పాలయింది. ఈ బాధ నుంచి కోలుకోక ముందే పాక్ జట్టుకు మరో పెద్ద షాక్ తగిలింది. గాయాల కారణంగా ఆ జట్టు స్టార్ పేస్ బౌలర్లు హ్యారిస్ రవూఫ్, నసీమ్ షాలు ఆసియాకప్ కు దూరమయ్యారు. వీరి స్థానంలో యువ పేసర్లు షానవాజ్ దహానీ, జమాన్ ఖాన్ జట్టులోకి వచ్చారు. ఈరోజు వీరిద్దరూ పాక్ జట్టుతో కలవనున్నారు. ఈ సందర్భంగా పాక్ క్రికెట్ బోర్డు ట్విట్టర్ (ఎక్స్) ద్వారా స్పందిస్తూ… రవూఫ్, నసీమ్ షా ఇద్దరూ తమ మెడికల్ ప్యానెల్ పరిశీలనలో ఉంటారని తెలిపింది. వారి గాయాలు అంత తీవ్రమైనవి కావని, ప్రపంచ కప్ ను దృష్టిలో పెట్టుకుని వారికి రెస్ట్ కల్పించామని చెప్పింది.
