హైదరాబాద్లోని గాంధీ భవన్లో పలువురు నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. మాజీ ఎమ్మెల్యే సీతా దయాకర్ రెడ్డి, ఆమె అనుచరులకు కాంగ్రెస్ కండువా కప్పి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, ఏఐసీసీ ఇన్చార్జ్ మాణిక్ రావు ఠాక్రే పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. గతంలో తాను స్వతంత్ర ఎమ్మెల్సీగా గెలిచేందుకు సీతా దయాకర్ రెడ్డి మద్దతు తెలిపారని అన్నారు. తన రాజకీయ ఎదుగుదలలో ఆమె అండగా నిలుస్తూ వచ్చారని తెలిపారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో టీడీపీతో టీఆర్ఎస్ పొత్తు పెట్టుకున్నప్పుడు కేసీఆర్ ను ఆమె ఎంపీగా గెలిపించారని చెప్పారు.
పాలమూరుకు కేసీఆర్ చేసింది ఏమీ లేదని రేవంత్ రెడ్డి విమర్శలు గుప్పించారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తి కాకముందే.. దాన్ని ప్రారంభిస్తున్నామంటూ గొప్పలు చెబుతున్నారని అన్నారు. 31 పంపుల్లో ఒకే ఒక్క పంపుతోనే ప్రాజెక్టును ప్రారంభిస్తున్నారని విమర్శించారు.
పాలమూరు జిల్లాలోని 14 అసెంబ్లీ స్థానాలన్నింటిలో కాంగ్రెస్ ను గెలిపించాలని ఆయన అన్నారు. సీతక్కను రాజకీయంగా తమ పార్టీ అన్ని రకాలుగా ఆదుకుంటుందని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో గెలిచి, కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.