హైదరాబాద్ నడిబొడ్డున పంజాగుట్టలోని మెరిడియన్ హోటల్‌లో ఈ దారుణ ఘటన జరిగింది. ఘటనలో పోలీసుల నిర్లక్ష్యం ఉందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దాడి సమాచారం తెలిసి పోలీసులు అక్కడికి చేరుకున్నప్పటికీ బాధితుడిని సరైన సమయంలో ఆస్పత్రికి తరలించకపోవడంతోనే మృతిచెందాడనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. పోలీసులు, బాధిత కుటుంబసభ్యుల వివరాల ప్రకారం.. పాతబస్తీ బండ్లగూడ హష్మాబాద్‌కు చెందిన లియాకత్ (32) స్థానికంగా వాటర్ ప్లాంట్ నిర్వహిస్తున్నాడు. అతడికి భార్య, నలుగురు పిల్లలున్నారు. ఆదివారం (ఈనెల 10న) రాత్రి 10.30 గంటలకు గోల్కొండ ఎండీ లైన్స్‌కు చెందిన ేస్నహితుడు సలీమ్ ఖాన్, మరో ఎనిమిది మందితో కలిసి పంజాగుట్టలోని మెరిడియన్ హోటల్‌కి వెళ్ళాడు. రెండు మటన్ బిర్యానీలు ఆర్డర్ చేసి, అదనంగా పెరుగు (రైతా) కావాలని చెప్పారు. రెండు, మూడుసార్లు చెప్పినా కూడా వెయిటర్ తేకపోవడంతో గట్టిగా ప్రశ్నించాడు. అతడిని వెయిటర్ అసభ్య పదజాలంతో దూషించాడు.
ఇది ఇద్దరి మధ్య వాగ్వాదానికి దారితీసింది. ఆ వెయిటర్‌కు మరో ఇద్దరు వెయిటర్లు తోడై లియాకత్‌తో గొడవ పడ్డారు. కొద్దిసేపటికి హోటల్ మేనేజర్, ఇద్దరు సూపర్‌వైజర్లు, మరి కొంతమంది వచ్చి లియాకత్‌ను ఇష్టంవచ్చినట్లుగా కొట్టారు. ఈ ఘటనతో హోటల్‌కు వచ్చిన మిగతా కస్టమర్లు తీవ్ర భయాందోళనకు లోనై బయటకు పరుగులు పెట్టారు. అరుపులు, కేకలతో హోటల్ మార్మోగింది. కాగా దాడి విషయాన్ని హోటల్ సిబ్బందిలో ఒకరు, హోటల్ యజమాని మహ్మద్ యూసుఫ్ ఖురేషీకి ఫోన్ చేసి చెప్పారు. అతడి సూచనల మేరకు హోటల్ తలుపులు మూసేసి లియాకత్‌ను మరోసారి కొట్టారు. పోలీసులకు సమాచారం అందడంతో రాత్రి విధుల్లో ఉన్న పంజాగుట్ట పోలీసులు అక్కడికి చేరుకున్నారు. అప్పటికీ హోటల్ సిబ్బంది గొడవను నిలిపివేయకుండా పోలీసుల సమక్షంలోనే మరోసారి లియాకత్, అతడి మిత్రులపై దాడి చేశారు. పోలీసులు కలుగజేసుకుని మహ్మద్ లియాకత్‌తో పాటు అతడితో వచ్చిన మహమ్మద్ ఒమర్, మహ్మద్ నాజర్,మహ్మద్ ముస్తఫా, సలీమ్ ఖాన్ లను, హోటల్ సిబ్బందిని పీఎస్‌కు తరలించారు. హోటల్ సిబ్బంది చేతుల్లో తీవ్రంగా గాయపడ్డ లియాకత్ తనకు ఊపిరి ఆడటం లేదని చెప్పినా పోలీసులు వినిపించుకోలేదు.
బాధితుడిని ఆస్పత్రికి తరలించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించి బలవంతంగా పీఎస్‌కు తీసుకెళ్లారు. కొద్దిసేపటికే లియాకత్ ఉన్నట్టుండి కుప్పకూలాడు. పోలీసులు హుటాహుటిన అతడిని ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే లియాకత్ మృతి చెందినట్లు వైద్యులు చెప్పారు. మృతుడి కుటుంబ సభ్యులు, మజ్లిస్ ఎమ్మెల్సీ మీర్జా రహ్మత్ బేగ్ అక్కడికి చేరుకుని ఆందోళనకు దిగారు. మృతుడి కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు మెరిడియన్ హోటల్ మేనేజర్ సయ్యద్ అఫ్తాబ్ హైదర్, హోటల్ సూపర్‌వైజర్లు అబ్దుల్ మెయిన్, హాజిజుద్దీన్, వెయిటర్లు కృష్ణ సూర్య ప్రకాశ్, మాలావత్ పాండుతో పాటు మరికొందరిపై 302, రెడ్ విత్ 34 కింద కేసు నమోదు చేశారు. సీసీ ఫుటేజీని, ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకుని పరిశీలిస్తున్నారు. ముందు జాగ్రత్తగా హోటల్‌ను మూసివేసి అక్కడ పోలీస్ పికెట్ ఏర్పాటు చేశారు. కాగా ఘటనపై సీపీ సీవీ ఆనంద్ సీరియస్ అయ్యారు. ఘటనలో ఎస్సై శివ శంకర్, హెడ్ కానిస్టేబుల్ రమేశ్ బాబు నిర్లక్ష్యం ఉందని గుర్తించి.. ఇద్దరినీ సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.