‘తెలంగాణ రాష్ట్ర ఎస్సీ కులాల సహకార అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్‌గా ఏర్పుల నరోత్తమ్ నియమితులయ్యారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులను జారీ చేసింది. ఈ ఉత్వర్వులను ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు, ఏర్పుల నరోత్తమ్‌కు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. తనకు చైర్మన్‌గా అవకాశం కల్పించినందుకు సీఎం కేసీఆర్‌కు ఏర్పుల నరోత్తమ్ ధన్యవాదాలు తెలిపారు.
నరోత్తమ్ రాజకీయ ప్రస్థానమిదీ..
ఏర్పుల నరోత్తమ్ జహీరాబాద్‌లోని పస్తాపూర్‌లో 1965, ఏప్రిల్ 19వ తేదీన చంద్రమ్మ, నర్సయ్య దంపతులకు మూడో సంతానంగా జన్మించారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి 1987 సివిల్ ఇంజినీరింగ్ పూర్తి చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో నీటి పారుదల శాఖలో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్‌గా ఉద్యోగం చేశారు. శ్రీశైలం ప్రాజెక్టు కాలువల డిజైన్లలో ఆయన కీలకపాత్ర పోషించారు. అనంతరం డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్‌గా ప్రమోషన్ పొందారు. సింగూరు ప్రాజెక్టు గేట్ల ఇంచార్జిగా వ్యవహరించారు. వికారాబాద్‌లో మైనర్ ఇరిగేషన్ ప్రాజెక్టులకు ఇంచార్జిగా కూడా బాధ్యతలు నిర్వర్తించారు.









