కామారెడ్డి : పెళ్లి రోజే పెళ్లి కుమారుడు శవమై కనిపించిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. సదాశినగర్ మండలం అడ్లూరు ఎల్లారెడ్డి కి చెందిన ముసర్ల రాజేందర్ రెడ్డి (29) కి ధర్పల్లి మండలానికి చెందిన యువతితో వివాహం నిశ్చయమైంది. ఐదు రోజుల క్రితం కటింగ్ కోసమని రాజేందర్ రెడ్డి ఇంటి నుంచి బయటకు వెళ్లాడు. అయితే ఇంటికి ఎంతకీ తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు అతనికి ఫోన్ చేయగా.. అది కూడా స్విచ్ ఆఫ్ అని వచ్చింది. దీంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. లింగంపేట వెళ్లే దారిలో రాజేందర్ రెడ్డి బైక్ కనిపించడంతో అక్కడి అటవీ ప్రాంతంలో గాలించారు. అక్కడ రాజేందర్ రెడ్డి ఉరి వేసుకుని మృతి చెంది ఉండటాన్ని గుర్తించారు. పోలీసులు రాజేందర్ రెడ్డి మృతికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు.
