ప్రముఖ రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ తాజాగా మరో వ్యాపారంలోకి దిగేందుకు రంగం చేస్తున్నారు. అదే హోటళ్ల వ్యాపారం. ఈ బిజినెస్‌లో అడుగు పెట్టి మరింతగా విస్తరించేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నట్లు సమాచారం. ఇప్పటికే రిలయన్స్ ఇండస్ట్రీస్‌తో పాటు చమురు రంగం, టెలికాం, రిటైల్ ఇలా రకరాల బిజినెస్‌లో రాణిస్తున్నారు. ఇవే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో రకాలలో ఇన్వెస్ట్‌మెంట్లు చేస్తున్నారు. పెద్దపెద్ద కంపెనీలు స్థాపించి ముందుకు సాగుతున్నారు.
ముఖేష్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ ది ఒబెరాయ్ హోటల్స్ అండ్ రిసార్ట్స్ (ఒబెరాయ్)తో ఒప్పందం కుదుర్చుకుంది.ఈ ఒప్పందం ప్రకారం 3 లగ్జరీ హాస్పిటాలిటీ ప్రాజెక్ట్‌లను నిర్వహించాలి. వీటిలో ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్‌లోని అనంత్ విలాస్ హోటల్. యూకేలోని ప్రతిష్టాత్మక స్టోక్ పార్క్, గుజరాత్‌లోని మరో ప్రాజెక్ట్ ఉన్నాయి.
ప్రపంచవ్యాప్తంగా హాస్పిటాలిటీ సెక్టార్‌లో అద్భుతమైన కస్టమర్ సర్వీస్‌లో ఒబెరాయ్‌కు గొప్ప ట్రాక్ రికార్డ్ ఉంది. ఒబెరాయ్ పోర్ట్‌ఫోలియోలో అనేక విల్లాలు, రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్‌లు, ప్యాలెస్‌లు, చారిత్రక ఆస్తులు ఉన్నాయి. ఇక యూకేలోని స్టోక్ పార్క్ లిమిటెడ్ ఇంగ్లండ్‌లోని రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ అనుబంధ సంస్థ. కంపెనీ బకింగ్‌హామ్‌షైర్‌లోని స్టోక్ పోగ్స్‌లో క్రీడలు, విశ్రాంతి సౌకర్యాన్ని కలిగి ఉంది. ఇందులో హోటల్, యూరప్‌లో అత్యధిక రేటింగ్ ఉన్న గోల్ఫ్ కోర్సు ఉన్నాయి. యూకే స్టోక్ పార్క్ లిమిటెడ్ సౌకర్యాలను అప్‌గ్రేడ్ చేయడంలో ఒబెరాయ్ సహాయం చేస్తుంది. ప్రతిష్టాత్మకమైన ప్రపంచ స్థాయి డెస్టినేషన్ ప్యాలెస్‌ని సృష్టించడం, అతిథులకు అద్భుతమైన అనుభూతిని అందించడం దీని ప్రధాన లక్ష్యం. అయితే గత సంవత్సరం ఒబెరాయ్ హోటల్స్ అండ్ రిసార్ట్స్ లో 73 శాతం వరకు వాటాను దాదాపు 100 మిలియన్ డాలర్లతో కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది.