రాఖీ పండగ రోజు తెలంగాణ ఆర్టీసీకి కాసులు కురిశాయి. రాఖీలు కట్టడానికి వెళ్లిన మహిళలు పెద్ద ఎత్తున ఆర్టీసీని ఆశ్రయించడంతో గురువారం తెలంగాణ ఆర్టీసీ కలెక్షన్లు భారీగా వచ్చాయి. రాఖీ పౌర్ణమి ఒక్కరోజే ఆర్టీసీకి ఏకంగా రూ. 20.65 కోట్ల ఆదాయం రావడం విశేషం. ఆర్టీసీకి ఈ స్థాయిలో ఆదాయం సమకూరడం పట్ల సంస్థ చైర్మన్ బాజిరెడ్డి గోవర్థన్ సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆర్టీసీ అధికారులకు, ఉద్యోగులకు ఆయన ప్రత్యేక అభినందనలు తెలిపారు. అంతేకాకుండా ఆర్టీసీ సంస్థను ప్రజలు మరింత ఆదరించాలని, ఆర్టీసీ సేవలను సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ప్రజలు ఆర్టీసీ బస్సులో ప్రయాణించేందుకు వీలుగా ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నామని గోవర్థన్ చెప్పుకొచ్చారు.
ఇందులో భాగంగానే ప్రయాణికుల కోసం మరిన్ని రాయితీలతో కూడిన పథకాలను ప్రవేశపెడుతున్నామని తెలిపారు. ఈ క్రమంలోనే కార్గో, బస్సు సర్వీసుల్లోనూ అనేక రాయితీలు అందిస్తూ, ప్రజల ఆదరణ చూరగొంటున్నట్లు చెప్పుకొచ్చారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఆర్టీసీకి అన్ని రకాలుగా సహాయాన్ని అందిస్తున్నారని చెప్పుకొచ్చారు.