కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు కంది శ్రీనివాస్‌రెడ్డి
సీఆర్‌ఆర్ ఆశయానికనుగుణంగా కలిసి పని చేస్తాం
ఆదిలాబాద్: వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో జోగురామన్నను ఓడించితీరుతామని, కాంగ్రెస్ కుటుంబం అంతా ఒక్కటై విజయం సాధిస్తామని కాంగ్రెస్ రాష్ట్ర నాయకుడు కంది శ్రీనివాసరెడ్డి అన్నారు. శుక్రవారం తన క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ దిగ్గజ నేత, తాతగారైన దివంగత చిలుకూరి రామచంద్రారెడ్డి జ్ఞాపకార్ధం ప్రతీ సంవత్సరం తన ఫౌండేషన్ తరఫున ఉత్తమ విద్యార్థులకు అవార్డులు ప్రదానం చేయనున్నట్లు కాంగ్రెస్ నాయకులు కెఎస్ ఆర్ ఫౌండేషన్ చైర్మన్ కంది శ్రీనివాస రెడ్డి తెలిపారు. చిల్కూరి రామచంద్రారెడ్డి లాంటి గొప్ప రాజకీయనేతలు చాలా అరుదుగా ఉంటారన్నారు. అలాంటి నిష్కల్మష నేతపై సోషల్ మీడియా ద్వారా అనుచిత, అసత్య ప్రచారాలను కంది శ్రీనివాసరెడ్డి ఖండించారు.
ఆయన స్ఫూర్తితోనే తను రాజకీయాల్లోకి వచ్చినట్టు తెలిపారు. ఫౌండేషన్ ద్వారా చేసే సేవల కంటే రాజకీయాల ద్వారా మరింత ఎక్కువగా ప్రజాసేవ చేయొచ్చనేది ఆయన్ను చూసే తెల్సుకున్నానని తెలిపారు. మంత్రిగా ,ఎమ్మెల్యేగా జిల్లాకే వన్నెతెచ్చిన అలాంటి గొప్పవ్యక్తి సేవలకు గుర్తుగా ఆయన కాంస్య విగ్రహాన్ని ఏర్పాటుచేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నట్టు తెలిపారు. అలాగే విశాల స్థలంలో ఆయన పేరుపై ఙ్ఞానభూమి ఏర్పాటు చేయాలన్నారు. చెనాక-కోరట బ్యారేజ్ కు చిలుకూరి రామచంద్రారెడ్డి పేరు పెట్టాలని కాంగ్రెస్ పార్టీ తరపున డిమాండ్ చేస్తున్నట్టు తెలిపారు. స్థానిక ఎమ్మెల్యే జోగురామన్నను ఓడించాలనేది సీఆర్‌ఆర్ ఆశయంగా ఉండేదని ఆ ఆశయ సాధనకోసం తామంతా కలిసికట్టుగా పనిచేసి ఆదిలాబాద్ లో పార్టీ గెలుపుకోసం ఐక్యంగా కృషిచేస్తామన్నారు. ఈ మీడియా సమావేశంలో గిమ్మ సంతోష్, భరత్ వాగ్మరే,నాగర్కర్ శంకర్, షకీల్, అల్లూరి అశోక్ రెడ్డి , రాజ్ మొహమ్మద్, మీరా, రవీందర్ రెడ్డి,షేక్ మన్సూర్, ముఖీమ్, అంజద్ ఖాన్, కర్మ, పోతారాజు సంతోష్, కిష్టా రెడ్డి తదితరులు పాల్గొన్నారు.