రాఖీ పండుగ అనగానే అన్నా చెల్లెళ్లు, అక్కా తమ్ముళ్ల అనుబంధం గుర్తుకు వస్తుంది. వారి మధ్య ఉన్న బంధానికి ప్రతీకే రక్షా బంధన్. జీవితాంతం రక్షగా ఉంటాడనే విశ్వాసానికి ప్రతీకి ఈ రాఖీ పండుగ. అయితే ప్రస్తుత ఉన్న ఉరుకుల పరుగుల యాంత్రిక జీవితంలో ఈ బంధాలు కాస్త పలుచబారుతున్నాయి. ఇలాంటి రోజుల్లో తన తమ్ముడికి రాఖీ కట్టడం కోసం ఓ 80 ఏళ్ల వృద్ధురాలు ఏకంగా 8 కిలోమీటర్లు నడిచింది. శరీరంలో సత్తువ చచ్చినా గానీ.. తన తమ్ముడిపై ప్రేమ మాత్రం చావలేదని నిరూపించింది. ఎర్రటి ఎండను సైతం లెక్క చేయకుండా.. కాలి నడకన తమ్ముడి రాఖీ కట్టేందుకు బయల్దేరింది. తల్లిదండ్రుల తర్వాత తోబుట్టువులే ఎక్కువ అని ఈ ఘటన రుజువు చేసింది.
వివరాల్లోకి వెళితే.. కరీంనగర్ జిల్లా కొత్తపల్లికి చెందిన ఓ 80 ఏళ్ల వృద్ధురాలు తన తమ్ముడికి రాఖీ కట్టేందుకు నడుచుకుంటూనే పొరుగునే ఉన్న కొండయ్యపల్లికి పయనమైంది. ఎర్రటి ఎండను సైతం లెక్కచేయకుండా.. కాళ్లకు చెప్పులు కూడా లేకుండా 8 కి.మీ నడుచుకుంటూ వెళ్తున్న వృద్ధురాలిని చూసిన ఓ యవకుడు ‘ఎక్కడికి పోతున్నవ్ అవ్వా’ అని పలకరించాడు. అప్పుడు ఆ వృద్ధురాలు తన తమ్ముడికి రాఖీ కట్టేందుకు వెళ్తున్నానని బదులిచ్చింది. తనది కొత్తపల్లి అని.. కొండయ్యపల్లిలో ఉన్న తమ్ముడికి రాఖీ కట్టేందుకు వెళ్తున్నానని చెప్పింది.