బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రాకు కజిన్ అయిన మన్నారా చోప్రా టాలీవుడ్ లో నిలదొక్కుకునే ప్రయత్నం చేస్తోంది. చిన్న చిన్న సినిమాలతో నటిగా తనను తాను నిరూపించుకునే ప్రయత్నంలో ఉంది. ప్రస్తుతం ఆమె ఏఎస్ రవికుమార్ చౌదరి దర్శకత్వంలో రాజ్ తరుణ్ హీరోగా ‘తిరగడబారా సామి’ అనే సినిమాలో నటిస్తోంది. ఈ మధ్యే ఈ సినిమా టీజర్ ను విడుదల చేశారు. ఈ ఈవెంట్‌లో దర్శకుడు ఏఎస్ రవి కుమార్ హీరోయిన్ మన్నారా చోప్రాతో వ్యవహరించిన తీరు వివాదాస్పదమైంది. సినిమా పోస్టర్ ముందు మన్నారా భుజంపై చేయివేసి, ఫొటోలకు పోజులిచ్చిన రవి కుమార్ ఆమె చెంపపై ముద్దు పెట్టాడు. ఆ సమయంలో ఎలా రియాక్ట్ అవ్వాలో తెలియక మన్నారా చోప్రా నవ్వుతూ ఊరుకుంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిపై పలువురు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హీరోయిన్లతో పబ్లిక్ గా ఇలా వ్యవహరించే వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దీనికి ఏఎస్ రవికుమార్, మన్నారా ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.
