ఖమ్మం జిల్లా సీనియర్ రాజకీయ నేత, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఖమ్మం జిల్లా ప్రజల కోసం ఎన్నికల్లో పోటీ చేస్తానని చెప్పారు. ఖమ్మం జిల్లాతో రాజకీయ అనుబంధాన్ని తెంచుకోవాలనుకున్నాను కానీ, జిల్లా ప్రజల కోసం ఎన్నికల్లో పోటీ చేస్తానని స్పష్టం చేశారు. తన జీవితాంతం జిల్లా ప్రజలకు రుణపడి ఉంటానని తెలిపారు. తన రాజకీయ పదవి తన కోసం కాదని.. ఖమ్మం జిల్లా కోసమని తెలిపారు.
శుక్రవారం తుమ్మల నాగేశ్వరరావు ర్యాలీ ఖమ్మంకు చేరుకుంది. తన అనుచరులతో గొల్లగూడెం నివాసానికి చేరుకుకున్న ఆయన కార్యకర్తలతో సమావేశం అయ్యారు. అనంతరం తుమ్మల కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు. కార్యకర్తల దయతోనే జిల్లా కోసం 40 ఏళ్లు పని చేశానని తెలిపారు. జిల్లా ప్రజల ఆర్థిక పరిస్థితులు మెరుగు పడాలని కృషి చేశానని తెలిపారు. 40 సంవత్సరాల పాటు అందిరికీ సౌకర్యాల కోసం తన జీవితాన్ని త్యాగం చేశానని చెప్పారు.
నాగలి దున్నుకునే తనను ఉమ్మడి రాష్ట్రంలో మంత్రిగా చేశారని పేర్కొన్నారు. మూడు ప్రభుత్వాలలో తనకు అవకాశం ఇచ్చారని గుర్తు చేశారు. తనకు కష్టం వచ్చినప్పుడు తనను కాపాడారని పేర్కొన్నారు. గోదావరి జలాలను పాలేరుకి తీసుకొస్తానని సీఎంకి చెప్పానని చెప్పారు. గోదావరి జలాలతో జిల్లా ప్రజల పాదాలు కడిగేంతవరకు ఎమ్మెల్యేగా ఉంటానని చెప్పారు. తన చేతులతో పాలేరు, వైరా, బేతుపల్లి, ఉమ్మడి జిల్లాలో నీళ్లు నింపి జిల్లా ప్రజలకు దూరం అవుతానని చెప్పారు.