సిద్ధిపేట.. తెలంగాణలో ఈ ప్రాంతానికి ప్రత్యేక స్థానం ఉంది. తెలంగాణ ఉద్యమ సమయంలో కీలక పాత్ర పోషించిన ఈ పట్టణం ఇప్పుడు అభివృద్ధిలో రాష్ట్రానికి రోల్ మోడల్‌గా నిలుస్తోంది. తక్కువ సమయంలో ఊహించని అభివృద్ధితో అందరి దృష్టిని ఆకర్షిస్తోందీ పట్టణం. మంత్రి హరీష్ రావు ప్రత్యేక దృష్టితో అభివృద్ధిలో రాకెట్ వేగంతో దూసుకుపోతోంది. కోమటి చెరువు, రంగనాయక సాగర్, గ్లో గార్డెన్ వంటి పర్యాటక ప్రదేశాలతో అట్రాక్ట్ చేస్తోంది. హైదరాబాద్ నుంచి కూడా పర్యాటకులు సిద్ధిపేట వస్తున్నారంటే అతిశయోక్తి లేదు.
ఇక పట్టణంలో ఇప్పటికే ఐటీ టవర్స్ ప్రారంభమైంది. అలాగే రంగనాయక్ సాగర్‌ను టూరిజానికి డెస్టినేషన్ గా మార్చే ప్రణాళికలు రచిస్తున్నారు. వీటితో పాటు డైనోసార్ పార్కును సైతం నిర్మిస్తున్నారు. ఇక సిద్ధిపేట అనగానే ముందుగా కొమటి చెరువు గుర్తొచ్చే స్థాయిలో ఈ ప్రాంతం అభివృద్ధి చెందింది. లేజర్ షో, హ్యాంగింగ్ బ్రిడ్జ్ వంటి ఎన్నో అద్భుతాలకు నెలవుగా మారింది కోమటి చెరువు. షార్ట్ మూవీస్, ప్రీ వెడ్డింగ్ షూట్స్ వంటి వాటికి ఇప్పుడు కోమటి చెరువు అడ్డాగా మారింది. ఇంతలా అట్రాక్ట్ చేస్తున్న కొమటి చెరువు ఇప్పుడు మరో అద్భుతానికి వేదిక కానుంది. సిద్ధిపేట కోమటి చెరువు దగ్గర మెగా డ్రోన్ షో నిర్వహించనున్నారు.
సుమారు 450 డ్రోన్‌లతో ఈ షోను ఏర్పాటు చేయనున్నారు. ఈ నెల 27వ తేదీ సాయంత్రం 6 గంటలకు ఈ డ్రోన్ షోను నిర్వహించనున్నారు. సిద్ధిపేటలో జరిగిన అభివృద్ధిని చూపేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.