AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

విద్యార్థుల్లో వివేకం.. ‘యువ టూరిజం క్లబ్స్‌’ కీలకం

– కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి
– వారణాసిలో నిర్వహించిన టూరిజం క్లబ్‌లో పాల్గొన్న కేంద్రమంత్రి

విద్యార్థుల్లో వివేకం పెంపొందించేందుకు యువ టూరిజం క్లబ్స్‌ కీలక పాత్ర పోషిస్తాయని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. వారణాసిలో భారత పర్యాటక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ‘సాంస్కృతిక విరాసత్‌ స్పర్ధ –2023’ లో భాగంగా యువ టూరిజం క్లబ్‌ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా కిషన్‌రెడ్డి పాల్గొని ప్రసంగించారు. భారత భవిష్యత్తు అంతా విద్యార్థులదేనని, అందుకు అధ్యాపకులు, ఉపాధ్యాయులు క్షేత్రస్థాయిలో అందిస్తున్న కృషి ఎనలేనిదని అన్నారు. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్‌లో యువ టూరిజం క్లబ్‌ల విషయంలో విశేషమైన కృషి జరుగుతోందని, ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికీ హార్దిక శుభాకాంక్షలు తెలిపారు. విద్యతోపాటుగా పాఠ్యేతర అంశాల్లోనూ విద్యార్థులు క్రియాశీలకంగా భాగస్వాములు కావాలని సూచించారు. అప్పుడే విద్యార్థి శారీరకంగా, మానసికంగా వికాసం చెందేందుకు వీలు పడుతుందని చెప్పారు.

99 శాతం విద్యపై దృష్టి పెడితే.. కనీసం ఒక్క శాతమైనా పాఠ్యేతర అంశాలపై దృష్టి కేంద్రీకరించాలని సూచించారు. స్పోర్ట్స్, ఎన్‌సీసీ, స్కౌట్స్‌ అండ్‌ గైడ్స్‌ లో.. లేదంటే.. ఇతర సామాజిక సేవా కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలని కిషన్‌రెడ్డి పిలుపునిచ్చారు. విద్యార్థుల్లో ఇలాంటి సేవా తత్పరతతోపాటు భారతదేశం పట్ల అవగాహన పెంచే లక్ష్యంతోనే.. కేంద్ర ప్రభుత్వం.. సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ‘యువ టూరిజం క్లబ్స్‌’ను ప్రారంభించిందని తెలిపారు.

ప్రతి ఇంట్లో కుటుంబ సమేతంగా పర్యాటక క్షేత్రాలకు సందర్శించాలంటే.. ఎక్కడకు వెళ్లాలని నిర్ణయించేది ఆ కుటుంబంలోని చిన్నారులు, విద్యార్థులేనని అన్నారు. అందుకే వారికి మనదేశంలోని, సమీపంలో ఉన్నటువంటి పర్యాటక క్షేత్రాలపై , ప్లాస్టిక్‌ రహిత పర్యాటకాన్ని ప్రోత్సహించడం తదితర అంశాలపై అవగాహన కల్పించే దిశగా ప్రోత్సహిస్తున్నామన్నారు. దేశవ్యాప్తంగా విద్యార్థులు స్వచ్ఛందంగా ‘యువ టూరిజం క్లబ్స్‌’లో భాగస్వామ్యం కావాలన్నారు. ‘యువ టూరిజం క్లబ్స్‌’ విషయంలో ఉత్తరప్రదేశ్‌ చాలా కీలకంగా ముందుకెళ్తోందన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సాంస్కృతిక కార్యక్రమాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. కళాకారులైన విద్యార్థులందరినీ కేంద్ర పర్యాటక మంత్రి జి.కిషన్‌ రెడ్డి అభినందించారు.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10