తెలంగాణ ఎన్నికలకు సమయం దగ్గరపడుతోంది. బీఆర్ఎస్ అధినేత, సీఎం కే చంద్రశేఖర్ రావు.. ఇప్పటికే అభ్యర్థుల తొలి జాబితాను ప్రకటించి ఎన్నికల సమర శంఖారావం పూరించారు.. అభ్యర్థుల ప్రకటనతో ముందడుగు వేసిన గులాబీ పార్టీ అధినేత.. ఇవాళ మెదక్ వేదికగా జరగనున్న బహిరంగ సభలో మాట్లాడనున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ మెదక్ టూర్ మరికాసేపట్లో ప్రారంభం కానుంది. అభ్యర్థుల తొలి జాబితా ప్రకటించిన తర్వాత ఫస్ట్ పర్యటన ఇదే కావడంతో.. మంత్రి హరీష్‌రావు దగ్గరుండి అన్ని ఏర్పాట్లను సమీక్షించారు. ఈ సందర్భంగా ఎన్నికల శంఖారావాన్ని పూరించడమే కాకుండా.. ప్రతిపక్షాలకు కేసీఆర్ తనదైన శైలిలో పొలిటికల్ కౌంటర్లు కూడా ఇస్తారని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి.
మెదక్ పర్యటన ఇలా.. సీఎం కేసీఆర్ ఈ ఉదయం కలెక్టర్ కార్యాలయం.. పోలీసు కార్యాలయంతో పాటు.. బీఆర్ఎస్ జిల్లా కార్యాలయాన్ని కూడా ప్రారంభించనున్నారు. హైదరాబాద్ నుంచి నర్సాపూర్ మీదుగా రోడ్డు మార్గంలో సీఎం మెదక్‌కు చేరుకోనున్నారు. ఎమ్మెల్యే అభ్యర్థులను ప్రకటించిన తర్వాత తొలిసారి ముఖ్య మంత్రి కేసీఆర్ మెదక్ జిల్లాలో పర్యటించనున్నారు. ఇందులో భాగంగా కేసీఆర్.. వికలాంగులు ఆసరా పెన్షన్ పెంపుతో పాటు , ఇతరులకు పింఛన్లు ఇచ్చే కార్యక్రమాన్ని కూడా ప్రారంభించనున్నారు.
మెదక్ నుంచి సీఎం కేసీఆర్ ప్రగతి శంఖారావంతో పాటు.. ఎన్నికల శంఖారావాన్ని కూడా పూరిస్తారని బీఆరఎస్ పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ సందర్భంగా ఉమ్మడి మెదక్ జిల్లాలో 10కి పది స్థానాలు గెలిచి, సీఎం కేసీఆర్‌కు కానుకగా ఇస్తామన్నారు హరీష్‌రావు. అభ్యర్థుల ప్రకటన తమ గెలుపునకు, ధీమాకు నిదర్శనమని.. కేసీఆర్ వ్యూహం ఎవరూ ఊహించలేదని, విపక్షాలు ఆగమైపోయాయని హరీష్ వ్యాఖ్యానించారు.