స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే రాజయ్య బోరున విలపించారు. సోమమారం కేసీఆర్ ప్రకటించిన ఎమ్మెల్యేల జాబితాలో తన పేరు లేకపోవడంతో ఆయన కార్యకర్తలపై పడి కన్నీటి పర్యంతమయ్యారు. తానెప్పుడూ సీఎం కేసీఆర్ ను పల్లెత్తు మాట అనలేదని, బీఆర్ఎస్ లో క్రియాశీల కార్యకర్తగానే పని చేశానని చెప్పారు. అయినప్పటికీ పార్టీ తనకు టికెట్ నిరాకరించిందని రోధించారు. స్థానిక అంబేద్కర్ విగ్రహం వద్ద నివాళులర్పించిన రాజయ్య అక్కడే కార్యకర్తల ముందు కన్నీటి పర్యంతమయ్యారు. కలిసి పని చేద్దాం కాంగ్రెస్ కు రాజీనామా చేసి రా అని కేసీఆర్ పిలిస్తే టీఆర్ఎస్ లో చేరానని కార్యకర్తలకు వివరించారు.
టికెట్ ఎందుకు ఇవ్వలేదో తనకు తెలియదని, తానెప్పుడూ ప్రజల మధ్యలో ఉంటూ ప్రజల కోసమే పని చేశానని స్పష్టం చేసారు. టికెట్ రాలేదని కార్యకర్తలెవరూ తొందరపడొద్దన్న రాజయ్య కలిసి కట్టుగా పని చేద్దామని పిలుపునిచ్చారు. పార్టీ కోసం, పార్టీ అభివృద్ధి కోసం నిరంతరం పాడుపడుదామని కార్యకర్తలను కోరారు. తనకు కేసీఆర్ అన్యాయం చేయరని అనుకుంటున్నానని, తాను చేసిన సేవలకు పార్టీ నేత సరైన సమయంలో సరైన గుర్తింపు ఇస్తారని నమ్ముతున్నట్లు రాజయ్య తెలిపారు.