ఇప్పుడు మరో కీలక నిర్ణయం తీసుకునేందుకు రెడీ అవుతోంది బీఆర్ఎస్ పార్టీ. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో మంత్రివర్గ విస్తరణకు రెడీ అవుతోంది. మంగళవారం లేదా బుధవారం.. ఈ రెండు రోజుల్లో ఎప్పుడైనా రాష్ట్ర మంత్రివర్గాన్ని విస్తరించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. మంత్రివర్గంలో ఉన్న ఒక ఖాళీని భర్తీ చేసే అవకాశం ఉంది. గతంలో ఈటెల రాజేందర్ బర్తరఫ్‌తో ఖాళీగా ఉన్న స్థానాన్ని భర్తీ చేయనున్నారు సీఎం కేసీఆర్. సామాజిక సమీకరణాల కోసం విస్తరణలో భాగంగా బండ ప్రకాష్ లేదా మాజీ మంత్రి మహేందర్‌రెడ్డికి చోటు దక్కే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది.
గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ రాష్ట్ర ప్రభుత్వం సమయం అడిగినట్లుగా తెలుస్తోంది. అయితే, రాజ్ భవన్ నుంచి ఎలాంటి క్లారిటీ రాలేదు. ఈ రెండు రోజుల్లో సమయం ఇస్తే వెంటనే మంత్రి వర్గ విస్తరణ ఉండనుంది. రానున్న ఎన్నికల్లో పోటీ చేసే బీఆర్ఎస్ అభ్యర్థులను ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన నేపథ్యంలో తాజాగా మంత్రివర్గ విస్తరణ వార్తలు రావడం ప్రాధాన్యత సంతరించుకుంది.