AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

కాంగ్రెస్‌లోకి మైనంపల్లి?.. టికెట్ కేటాయించినా అసంతృప్తి

మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కేసీఆర్ ప్రకటించిన అభ్యర్థుల జాబితాలో మైనంపల్లికి టికెట్ కేటాయించారు. అయినా, ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. మంత్రి హరీష్ రావుపై సంచలన వ్యాఖ్యలు చేశారు.

బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు కాంగ్రెస్ పార్టీలో చేరతారనే వార్తలు వినిపిస్తున్నాయి. కేసీఆర్ ప్రకటించిన జాబితాలో మల్కాజిగిరి స్థానం నుంచి మైనంపల్లికి యథావిధిగా టికెట్‌ను కేటాయించారు. అయితే, మెదక్ స్థానం నుంచి ఆయన తన కుమారుడు రోహిత్‌కు టికెట్ ఆశించారు. కుమారుడికి టికెట్ దక్కకపోవడంతో తండ్రీకుమారులిద్దరూ కలిసి కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మల్కాజిగిరి నుంచి మైనంపల్లి హనుమంతరావుకు, మెదక్ స్థానం నుంచి మైనంపల్లి రోహిత్‌కు టికెట్లు కేటాయించేందుకు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. మెదక్ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డికే మరోసారి టికెట్ కేటాయించింది బీఆర్‌ఎస్.

సోమవారం ఉదయం తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చిన మైనంపల్లి.. మీడియాతో మాట్లాడుతూ హరీష్ రావుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తన కుమారుడికి మెదక్ స్థానం నుంచి టికెట్ దక్కకపోతే.. సిద్దిపేటలో హరీష్ రావుకు తడాఖా చూపిస్తానని సవాల్ చేశారు. ఈ వ్యాఖ్యలను బీఆర్‌ఎస్ అధిష్టానం తీవ్రంగా పరిగణించింది. మంత్రి కేటీఆర్, ఎమ్మెల్సీ కవిత ట్విటర్ వేదికగా సీరియస్‌గా స్పందించారు.

మైనంపల్లిపై క్రమశిక్షణా చర్యలు తీసుకునేందుకు బీఆర్‌ఎస్ సిద్ధమైనట్లు తెలుస్తోంది. పార్టీ ఆదేశాలు పాటించకపోతే.. ఎంతటివారైనా సరే తీసిపడేస్తామని కేసీఆర్ హెచ్చరించారు. ఈ నేపథ్యంలో మైనంపల్లి హన్మంతరావు కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

ANN TOP 10