భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) చంద్రుడిపైకి ప్రయోగించిన చంద్రయాన్-3 స్పేస్‌క్రాఫ్ట్ విజయవంతంగా లక్ష్యానికి దగ్గరైంది. చంద్రుడి ఆవరణంలో చివరిది, ఐదవది అయిన కక్ష్య తగ్గింపు ప్రక్రియను కూడా ఇస్రో శాస్త్రవేత్తలు బుధవారం ఉదయం 8.30 గంటలకు విజయవంతంగా పూర్తిచేశారు. దాంతో ప్రస్తుతం చంద్రుడి చుట్టూ ఉన్న 153 కిలోమీటర్లు X 163 కిలోమీటర్ల కక్ష్యలోకి స్పేస్‌క్రాఫ్ట్ తిరుగుతున్నది.
అంతా సవ్యంగా సాగితే మరో వారం రోజుల్లో చంద్రయాన్-3 స్పేస్‌క్రాఫ్ట్ విజయవంతంగా చుంద్రుడి ఉపరితలంపై దిగుతుంది. రేపు (ఆగస్టు 17న) స్పేస్‌క్రాఫ్ట్‌లోని ప్రొపల్షన్ మాడ్యూల్ నుంచి ల్యాండర్ మాడ్యూల్ విడిపోతుందని ఇస్రో సైంటిస్టులు ప్రకటించారు. ఆ తర్వాత క్రమంగా ల్యాండర్ మాడ్యూల్ వేగాన్ని తగ్గిస్తూ చంద్రుడి ఉపరితలంపై దించనున్నారు. చంద్రయాన్-2 సందర్భంగా ల్యాండింగ్ దగ్గరే ప్రయోగం విఫలమైంది. ఆగస్టు 23 లేదా 24 తేదీల్లో ల్యాండర్ చందమామపై దిగే అవకాశం ఉన్నది.