AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

హైదరాబాద్‌లో షాకింగ్ దొంగతనం.. బిర్యానీ తెచ్చే గ్యాప్‌లోనే..

దొంగలు రోజురోజుకు తెలివి మీరి పోతున్నారు. మాటలతో మాయ చేసేసి.. చిన్న గ్యాప్ దొరికిందంటే చాలు.. తమ పని కానిచ్చేస్తున్నారు. అచ్చం అలాంటి ఘటనే జరిగింది.. హైదరాబాద్ సమీపంలోని పటాన్ చెరులో కూడా. క్యాబ్ డ్రైవర్‌ను బిర్యానీ తీసుకురమ్మని పంపించి.. తీసుకొచ్చేలోపే కారుతో సహా మాయమైపోయాడు ఓ దొంగ. అది కూడా ఏ రాత్రో కాదండోయ్.. పట్టపగలే పని కానిచ్చేశాడు. జహీరాబాద్‌ నుంచి హైదరాబాద్‌కు వెళ్లాలని ఓ వ్యక్తి.. క్యాబ్‌ మాట్లాడుకున్నాడు. తాను మహారాష్ట్రకు చెందిన క్రైమ్‌ బ్రాంచీ పోలీసుగా పరిచయం చేసుకున్నాడు. ఎవరైతే ఏంటీ తనకు గిరాకీ ముఖ్యమని భావించిన క్యాబ్ డ్రైవర్.. ఎలాంటి అనుమానాలు లేకుండానే ఎక్కించుకున్నాడు.

హైదరాబాద్‌‌కు వస్తున్న క్రమంలో.. పటాన్‌చెరు మండలం రుద్రారం వద్దకు రాగానే.. తనకు ఆకలేస్తుందని డ్రైవర్‌తో చెప్పాడు ప్రయాణికుడు. ఎక్కడైనా మంచి బిర్యానీ దొరికే దగ్గర ఆపమన్నాడు. అందుకు తగ్గట్టుగానే ఆ డ్రైవర్ ఓ మంచి హోటల్ ముందు ఆపాడు. పోలీసు హుందాతనాన్ని ప్రదర్శిస్తూ.. బిర్యానీ తీసుకురావాలని ఆదేశం జారీ చేశాడు. పోలీసు అని చెప్పటంతో.. ఆ డ్రైవర్ కూడా ఏమీ ఎదురు మాట్లాడకుండా బిర్యానీ తీసుకొచ్చేందుకు వెళ్లాడు. అయితే.. తిరిగి వచ్చి చూస్తే.. డ్రైవర్ షాక్. అక్కడ ఆ వ్యక్తి లేడు.. తన కారు కూడా లేదు.

బిర్యానీ తెచ్చేలోపే.. ఆ ప్రయాణికుడు కారుతో సహా అక్కడి నుంచి పరారయ్యాడు. విషయం అర్థమైన క్యాబ్‌ డ్రైవర్‌ గుండెలుబాదుకుంటూ పోలీసులను ఆశ్రయించాడు. విషయం అర్థమైన పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ఆ మార్గంలోని సీసీఫుటేజ్ ఆధారంగా నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

ANN TOP 10