స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా తెలంగాణ ఆర్టీసీ ప్రయాణికులకు శుభవార్త చెప్పింది. శంషాబాద్ విమానాశ్రయంలో పుష్పక్ బస్సు ఎక్కే వారికి శుభవార్త చెప్పింది. నగరంలో ఎక్కడికైనా ఫ్రీగా జర్నీ చేసే సదుపాయాన్ని గ్రేటర్ హైదరాబాద్ జోన్ అందుబాటులోకి తెచ్చింది. పుష్పక్ బస్సులో టిక్కెట్ కొన్న సమయం నుంచి 3 గంటలపాటు ఇతర సిటీ బస్సుల్లో ఈ ఫ్రీ జర్నీ చేసే అవకాశాన్ని కల్పించింది ఆర్టీసీ. శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి పుష్పక్ బస్సులు నగరంలోని కొన్ని ప్రధాన ప్రాంతాలకే నడుస్తుంటాయి.
చివరి స్టాప్ లేదా మార్గ మధ్యలో దిగిన ప్రయాణికులు అక్కడి నుంచి మళ్లీ ప్రయాణించాల్సి వస్తే ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో వారు మూడు గంటల పాటు సిటీ బస్సుల్లో ఫ్రీగా జర్నీ చేసే అవకాశాన్ని కల్పిస్తోంది టీఎస్ఆర్టీసీ. ఎయిర్‌పోర్టు బస్ స్టాపులో పుష్పక్ బస్ ఎక్కి టికెట్ కొన్నవారికే ఈ ఆఫర్ వర్తిస్తుందని ఆర్టీసీ అధికారులు వెల్లడించారు.