నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ ఐటీలో లోపాలపై అధికారులు దిద్దుబాటు చర్యలు ప్రారంభించారు. విద్యాసంవత్సరం ప్రారంభమైన మూడు నెలల్లో ముగ్గురు విద్యార్థులు మృతి చెందడాన్ని అధికారులు సీరియ్‌సగా తీసుకున్నారు. శుక్రవారం ‘ఆంధ్రజ్యోతి’ ప్రధాన సంచికలో ‘ఆటపాటల్లేవు’ అన్న శీర్షికతో ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించారు. ఈ మేరకు శుక్రవారం వర్సిటీ వైస్ చాన్స్‌లర్ వెంకటరమణ, నిర్మల్ జిల్లా కలెక్టర్ వరుణ్ రెడ్డి వరుస సమావేశాలు నిర్వహించారు.
విద్యార్థుల పర్యవేక్షణ బాధ్యతలను అధ్యాపకులకు అప్పజెప్పారు. ప్రతి అధ్యాపకుడికి వంద నుంచి 150 మంది విద్యార్థులకు మెంటరింగ్షిప్ బాధ్యతలను అప్పజెప్పి 15 రోజులకు ఒకసారి కౌన్సెలింగ్ నిర్వహించాలని ఆదేశించారు. తరచుగా విద్యార్థుల తల్లిదండ్రులతో సమావేశాలు ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు వారి సూచనలను స్వీకరించి సమస్యలను పరిష్కరిస్తూ ముందుకెళ్లాలని అధికారులు భావిస్తున్నారు. విద్యార్థులపై ఒత్తిడి పటాపంచలై ఉల్లాసభరితంగా గడిపే విధంగా కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
విద్యార్థులకు క్రీడలపై ఆసక్తి పెంచేలా అవసరమైన క్రీడా పరికరాలను సమకూర్చేందుకు ఆదేశాలిచ్చారు. ప్రతి శనివారం సాయంత్రం ‘ఆర్యూ ఓకే’ అనే కార్యక్రమంతో మ్యూజిక్ ఏర్పాటు చేసి బాలురు, బాలికలు వేర్వేరుగా ఒత్తిడి నుంచి ఉపశమనం పొందేందుకు డ్యాన్స్ కార్యక్రమం నిర్వహించనున్నట్లు ప్రకటించారు. ఇక నుంచి ప్రతిరోజు ఉదయం 6 నుంచి 7 గంటల దాకా గంటపాటు యోగా క్లాసును నిర్వహించనున్నారు. ప్రతి శనివారం రాత్రి విద్యార్థులు మూవీస్, వీడియోలను వీక్షించే విధంగా చర్యలు చేపట్టారు.