– ప్రధానిపై రాహుల్ తీవ్ర విమర్శలు
రెండు గంటల ప్రసంగంలో మణిపూర్‌పై మాట్లాడేది రెండు నిమిషాలేనా?
నెలలు తరబడి మణిపూర్ మండుతుంటే ఆ అంశంపై చర్చలో పాల్గొన్న ప్రధాని నవ్వులు చిందిస్తూ, జోక్‌లు విసరడాన్ని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తప్పుపట్టారు. ప్రధాని హోదాకు ఇది తగదన్నారు. శుక్రవారం నాడిక్కడ ఏఐసీసీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో రాహుల్ గాంధీ మాట్లాడారు. ప్రధాని మోడీ, హౌంమంత్రి అమిత్ షాలు మణిపూర్‌లో భారతమాతను హత్య చేశారంటూ తాను చేసిన వ్యాఖ్యలు బూటకపు మాటలు కాదని అన్నారు. ‘పార్లమెంటులో ప్రధానమంత్రి 2:13 గంటలు మాట్లాడారు. అందులో మణిపూర్‌పై మాట్లాడింది 2 నిమిషాలే. రాష్ట్రాన్ని, అక్కడి మహిళలను ప్రధాని ఎగతాళి చేశారు.
మణిపూర్ నెలల తరబడి మండుతోంది. ప్రజలు విలువైన ప్రాణాలు కోల్పోయారు. అత్యాచారాలు జరిగాయి. కానీ ప్రధాని మాత్రం నవ్వులు చిందిస్తూ, జోకులు విసురుతున్నారు. ఇది ఆయనకు తగదు” అని రాహుల్ విమర్శించారు. మణిపూర్ ఘర్షణలను ఆర్మీ కేవలం రెండు రోజుల్లో నిలిపివేయగలదన్నారు. కానీ మణిపూర్ రగులుతూనే ఉండాలని ప్రధాని కోరుకున్నారనీ, అందుకే మంటలను చల్చార్చే ప్రయత్నం చేయలేదని విమర్శించారు. మణిపూర్‌ను సైన్యం అదుపులోకి తీసుకోవాలని తాను కోరినప్పుడు బీజేపీ తనను విమర్శించిందని అన్నారు. మణిపూర్‌పై అసలు చర్చలే జరగలేదని, కేవలం హింస మాత్రమే చోటచేసుకుందని దుయ్యబట్టారు. హింసను మొదట అదుపు చేసి, ఆ తరువాత దానికి చరమగీతం పాడాల్సి ఉంటుందని అన్నారు. ప్రధాని వద్ద ఇందుకు అవసరమైన అన్ని అస్త్రాలు ఉన్నప్పటికీ ఆయన వాటిని వాడలేదని, చేసిందేమీ లేకపోగా నవ్వులు చిందిస్తున్నారని తప్పుపట్టారు.
”మణిపూర్‌లో దేశం ఆలోచనను బీజేపీ హత్య చేసిందని చెప్పాను. నేను రూపకంగా మాట్లాడలేదు. నేను అక్షరాలా మాట్లాడుతున్నాను” అని అన్నారు. ‘అందుకే నేను నా ప్రసంగంలో (లోక్‌సభలో) మణిపూర్‌లో భారత మాత హత్యకు గురయ్యిందని చెప్పాను. మొదటిసారిగా, భారత మాత అనే పదాలను పార్లమెంట్ నుండి బహిష్కరించారు. ఇది ఆ మాటలను అవమానించడం. నేను చెప్పింది తప్పా? ప్రతి ఒక్కరూ శాంతియుతంగా, సామరస్యపూర్వకంగా, ఆప్యాయతతో జీవించే భారతదేశ ఆలోచన అయిన భారత్ మాత మణిపూర్‌లో హత్యకు గురైంది, ఇది వాస్తవం’ అని రాహుల్ గాంధీ అన్నారు.