గతంలో హత్యాయత్నం జరిగినప్పుడు ప్రజా యుద్ధ నౌక గద్దర్‌ను బతికించుకోవాలని శాయశక్తులా ప్రయత్నించామని విశ్రాంత ఐఏఎస్ అధికారి కె.లక్ష్మీనారాయణ చెప్పారు. గద్దర్ భౌతిక కాయాన్ని సోమవారం సందర్శించిన అనంతరం ఆయనతో తనకున్న అనుబంధాన్ని వివరించారు. ‘‘గద్దర్‌తో నాది ప్రత్యేకమైన అనుబంధం. ఆయనపై 1997 ఏప్రిల్ 6 ఆదివారం సాయంత్రం హత్యాయత్నం జరిగిన సంగతి తెలిసిందే. ఆ మరుసటి రోజు ఉదయం 5.45 గంటలకు అప్పటి సీఎం చంద్రబాబు నాకు ఫోన్ చేశారు. ‘ఓ కవి మీద ఇలాంటి దాడి జరగడం బాధాకరం. గద్దర్‌ను బతికించుకోవాలి. అవసరమైతే బయటి రాష్ట్రాల నుంచి కూడా డాక్టర్లను పిలిపించండి. ఎంత ఖర్చయినా ఫర్వాలేదు. ఆయన మాత్రం కోలుకోవాలి’ అని నిర్దేశించారు.
అప్పట్లో నేను సీఎంకు డిప్యూటీ సెక్రటరీగా వైద్య, ఆరోగ్య శాఖ వ్యవహారాలను చూస్తున్నాను. ఆ మరుక్షణమే అదే శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సి.అర్జునరావుతో కలిసి నిమ్స్ ఆస్పత్రి డైరెక్టర్ కాకర్ల సుబ్బారావుతో మాట్లాడాం. అర్జున రావు నిమ్స్ ఆస్పత్రిలో దగ్గరుండి మరీ ట్రీట్మెంట్‌ను పర్యవేక్షించారు. తర్వాత మూడు రోజులకు అంటే ఏప్రిల్ 11న గద్దర్ కళ్లు తెరిచినట్టు గుర్తు. ప్రాణాపాయం లేదని తెలిసిన తర్వాతే మేమంతా కుదుటపడ్డాం.
అంత వరకూ చంద్రబాబు కలత చెందడాన్ని కళ్లారా చూశాను’’ అని గుర్తు చేసుకున్నారు. ఆపై ఐదేళ్లకు ఓ ప్రైవేటు వేడుకలో గద్దర్‌ను కలిశానని, అప్పుడు ఆయన తనను ఆలింగనం చేసుకొని, ‘మీరు దగ్గరుండి మరీ నా ప్రాణాలు కాపాడారు. మీ రుణం తీర్చుకోలేనిది’ అంటూ భావోద్వేగానికి లోనయ్యారని తెలిపారు. ఆ తర్వాత చాలా సందర్భాల్లో ఇరువురం కలిసి మాట్లాడుకునేవారిమని, తాను ఎదురుపడిన ప్రతిసారీ ఎంతో ఆప్యాయంగా పలకరించేవారని, అలాంటి అరుదైన వ్యక్తి మరణం తనను తీవ్రంగా బాధించిందని చెప్పారు.