చంద్రుడిపై వెళ్లే క్రమంలో చంద్రయాన్-3 మరో కీలక ఘట్టాన్ని పూర్తి చేసుకుంది. ఆదివారం రాత్రి వ్యోమనౌకలోని ఇంజిన్ను మండించిన ఇస్రో శాస్త్రవేత్తలు.. చంద్రయాన్-3 కక్ష్యను మరింత తగ్గించారు. దీంతో చంద్రయాన్-3 ఉపగ్రహం చంద్రుడి ఉపరితలానికి మరింత చేరువైంది. మళ్లీ రెండోసారి ఆగస్టు 9న మధ్యాహ్నం 1.00 నుంచి 2.00 గంటల మధ్య ఇంజిన్ను మండించనున్నారు. ఆ తర్వాత మరో రెండుసార్లు ఈ విన్యాసాన్ని నిర్వహించనున్నారు. దశలవారీగా వ్యోమనౌక ఎత్తును తగ్గించి.. చివరిగా చంద్రుడి చుట్టూ ఉన్న 100 కిలోమీటర్ల దీర్ఘ వృత్తాకార కక్ష్యలోకి ప్రవేశపెడతారు.
అన్నీ అనుకున్నట్టు జరిగితే ఆగస్టు 23న ఈ వ్యోమనౌకను చంద్రుడి ఉపరితలంపైకి దింపనున్నారు. జులై 14న ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి జిల్లా శ్రీహరికోట నుంచి నింగిలోకి పయనమైన చంద్రయాన్-3.. వివిధ దశలు పూర్తిచేసుకుని, శనివారం రాత్రి చందమామ కక్ష్యలోకి ప్రవేశించిన సంగతి తెలిసిందే. ఇప్పటి వరకూ అమెరికా, చైనా, రష్యా మాత్రమే చంద్రుడిపై సాఫ్ట్ ల్యాండింగ్ చేయగలిగాయి. ఒకవేళ, చంద్రయాన్-3 విజయవంతైమైతే భారత్ వాటి సరసన చేరుతుంది. మరోవైపు, శనివారం చంద్రుడి కక్ష్యలోకి ప్రవేశించిన చంద్రయాన్-3.. ఉపరితలం ఫోటోలను తీసింది. ఈ ఫోటోలను చంద్రయాన్-3 మిషన్ అధికారిక ట్విట్టర్లో షేర్ చేసింది.
జులై 14న చంద్రయాన్-3 ప్రయాణం ప్రారంభమైనప్పటి నుంచి చంద్రుడికి మూడింట రెండు వంతుల దూరాన్ని కవర్ చేసి శనివారం విజయవంతంగా చంద్రుడి కక్ష్యలోకి ప్రవేశించినట్లు ఇస్రో తెలిపింది. ఉపరితలంపై ల్యాండింగ్ తర్వాత ఇది ఒక లూనార్ రోజు (భూమిపై దాదాపు 14 రోజులకు సమానం) పరిశోధనలు చేయనుంది.