ఆశ్రునయనాల మధ్య ప్రజాగాయకుడు గద్దర్ అంత్యక్రియలు ముగిశాయి. ఆయన అంత్యక్రియలను ఆయనకు చెందిన మహాబోధి స్కూల్ ఆవరణలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వివిధ పార్టీల నాయకులు, కళాకారులు, కవులు హాజరయ్యారు. చివరిసారిగా ఆయనకు కన్నీటి వీడ్కోలు పలికారు. జోహర్ గద్దర్ అని నినదించారు. పోలీసులు గద్దర్ కు గౌరవ వందనం సమర్పించారు. బౌద్ధ మత సంప్రదాయాల ప్రకారం గద్దర్ కు అంత్యక్రియలు నిర్వహించారు. గద్దర్ చివరి చూపు కోసం అభిమానులు, ప్రజలు పోటెత్తారు. దీంతో వారికి నియంత్రించేందుకు పోలీసులు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. అంతకు ముందు గద్దర్ ఇంటికి వెళ్లిన రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్.. యుద్ధనౌక భౌతికకాయానికి నివాళులు అర్పించారు.
అంతకముందు 6 గంటల పాటు భాగ్యనగరంలో 17 కిలోమీటర్లు అంతిమయాత్ర సాగింది. ఎల్బీ స్టేడియం నుంచి అల్వాల్ వరకు సాగిన ఈ అంతిమయాత్రలో గద్దర్ అభిమానులు, కళాకారులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అంతకుముందు అనేక పార్టీలకు చెందిన నాయకులు, ప్రజాసంఘాల నేతలు, కళాకారులు గద్దర్‌కు నివాళులర్పించారు. ఆయనతో ఉన్న అనుబంధాలను గుర్తుచేసుకుని కన్నీటి పర్యంతం అయ్యారు.