గద్దర్ అంతిమ యాత్రలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. అంతిమ యాత్రలో పాల్గొనేందుకు వచ్చిన సియాసత్ ఉర్దూ పత్రిక మేనేజింగ్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీ ఖాన్ గుండెపోటుతో మృతి చెందారు. తోపులాట కారణంగానే ఆయన మృతి చెందినట్టు సమాచారం. గద్దర్ కు అత్యంత సన్నిహితుడిగా చెప్పుకునే జహీరుద్దీన్ అలీ ఖాన్.. ఈ రోజు ఆయన అంతిమయాత్రలో పాల్గొన్నారు. ఎల్బీ స్టేడియం నుంచి గద్దర్ ఇంటి వరకు సాగిన యాత్రలో ఆయన కూడా ఉన్నారు. ఈ సమయంలో జరిగిన తోపులాటలో ఊపిరాడకపోవడం వల్ల తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వెంటనే ఆయనను ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు జహీరుద్దీన్ అలీ ఖాన్.
తోపులాటలో కిందపడిన జహీరుద్దీన్‌ను గమనించిన కొంత మంది, ఆయణ్ని పైకి లేపి వెంటనే ఆస్పత్రికి తరలించారు. అయితే, ఆయన అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. గుండెపోటుకు గురవ్వడం వల్ల జహీరుద్దీన్ మరణించినట్లు తెలిపారు. తోపులాటలో కిందపడటం వల్ల ఆందోళనకు గురవ్వడంతో గుండెపోటుకు గురైనట్లు భావిస్తున్నారు.
తమ అభిమాన కళాకారుడిని కడసారి చూసేందుకు జనం పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన అభిమానులు, ప్రముఖులు, మీడియా ప్రతినిధులు, ఇతరులతో అంతిమయాత్ర సాగుతున్న దారులన్నీ కిక్కిరిసిపోయాయి. అంత్యక్రియలకు ఏర్పాటు చేసిన అల్వాల్‌లోని మహాబోధి పాఠశాల ప్రాంగణం, ఆ మార్గం సరిపోలేదు. దీంతో తోపులాట చోటు చేసుకుంది. పోలీసులు లాఠీలను పనిచెప్పి పరిస్థితిని చక్కదిద్దారు. అంతిమ సంస్కారాలు నిర్వహించిన ప్రదేశానికి కుటుంబసభ్యులు, దగ్గరి బంధువులు కొందరిని మాత్రమే అనుమతించారు. మైకుల ద్వారా ఎప్పటికప్పుడు ఆదేశాలు జారీ చేశారు.