AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

ప్రజాక్షేత్రంలోకి రావాలని భావించి..

చివరి కోరిక తీరకుండానే కన్నుమూసిన గద్దర్..
దశాబ్దాల పాటు ప్రజల కోసం ప్రభుత్వాలతో కొట్లాడిన గద్దర్.. తన చివరి కోరిక తీరకుండానే తుదిశ్వాస విడిచారు. తొలి దశ, మలి దశ తెలంగాణ ఉద్యమాల్లో కీలక పాత్ర పోషించిన ఈ ప్రజా యుద్ధనౌక.. తెలంగాణ వచ్చిన తర్వాత కూడా కేసీఆర్ ప్రభుత్వంపై పలుమార్లు బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేశారు. తెలంగాణ వస్తే ప్రజల బతుకులు బాగుపడతాయని ఉద్యమంలో ప్రాణాలు అర్పించిన అమరులు కోరుకున్న తెలంగాణ రాలేదని బాహటంగానే తన ఆవేదనను వ్యక్తం చేశారు.

అయితే ఇన్నాళ్లు ప్రజల కోసం పోరాటం చేసిన గద్దర్.. ఈసారి నేరుగా ఎన్నికల బరిలో నిలబడాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం.
వచ్చే ఏడాది జరగనున్న లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయాలని గద్దర్ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. అయితే పెద్దపల్లి నుంచి లోక్‌సభకు గద్దర్ పోటీ చేయనున్నారనే ప్రచారం ఇటీవల భారీగా జరిగింది. ఇందుకోసం కొన్ని నెలల క్రితం ఏర్పాట్లు కూడా మొదలు పెట్టారు. ఈ అక్టోబర్‌లో వరంగల్‌లో ఒక పెద్ద సమావేశం నిర్వహించేలా సన్నాహాలు కూడా చేశారు.

మరోవైపు.. ఇటీవల ఆస్పత్రిలో చేరిన తర్వాత కూడా గద్దర్ ఒక బహిరంగ లేఖను విడుదల చేశారు. గుండె సంబంధిత వ్యాధితో జులై 20 వ తేదీన అపోలో ఆస్పత్రిలో చేరిన గద్దర్‌.. జులై 31 వ తేదీన తెలంగాణ ప్రజలకు ఒక లేఖ రాశారు. త్వరలోనే తాను అనారోగ్యం నుంచి కోలుకుని.. తిరిగి ప్రజాక్షేత్రంలోకి అడుగు పెడతానంటూ ఆ లేఖలో వెల్లడించారు. తన వయసు ప్రస్తుతం 76 ఏళ్లని.. తన వెన్నుపూసలో ఉన్న బుల్లెట్ వయసు 25 సంవత్సరాలని లేఖలో పేర్కొన్నారు. కానీ తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయారు. దీంతో తిరిగి వస్తావని మాట ఇచ్చావు కదా.. గద్దర్‌ అన్నా.. మరి ఇదేంటి అంటూ ఆయన అభిమానులు కన్నీరు పెట్టుకుంటున్నారు.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10