ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాసంపై చర్చ తేదీలు ఖరారు
పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభమైనప్పటి నుంచి మణిపూర్ అంశంపై ఇరు సభలు వాయిదాలతోనే కాలం వెళ్లదీస్తున్నాయి. మణిపూర్లో మహిళలపై జరిగిన అమానవీయ ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ సమాధానం ఇవ్వాలని పట్టుబడుతుండగా.. స్వల్ప కాలిక చర్చ చేపడతామని కేంద్ర ప్రభుత్వం చెప్పడంతో పార్లమెంటులో ప్రతిష్ఠంభన వీడటం లేదు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా.. మణిపూర్ ఘటనపై బదులు ఇస్తారని కేంద్రం చెప్పినప్పటికీ ప్రతిపక్షాలు.. ప్రధాని మోదీ స్పందించాలని డిమాండ్ చేశాయి. ఈ నేపథ్యంలోనే చివరి అస్త్రంగా ప్రతిపక్షాలు.. అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టాయి. ఈ అవిశ్వాస తీర్మానాన్ని స్పీకర్ ఓం బిర్లా ఆమోదించగా.. లోక్సభ వ్యవహారాల కమిటీ సమావేశం నిర్వహించి.. తేదీలు ఖరారు చేసింది. ఆగస్టు 8వ తేదీ నుంచి 3 రోజులపాటు అవిశ్వాస తీర్మానంపై పార్లమెంటులో చర్చ జరగనుంది. చివరి రోజైన ఆగస్టు 10వ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సమాధానం చెప్పనున్నారు.
ఈ అవిశ్వాస తీర్మానంతో మోదీ సర్కారు కూలిపోయే పరిస్థితి లేనేలేదు. అయితే ఈ అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టి.. అందులో మెజారిటీ ఓట్లు సాధించలేమని తెలిసినప్పటికీ ప్రతిపక్షాలు ప్రవేశపెట్టాయి. దీనికి కారణం.. మణిపూర్ ఘటనలపై ప్రధాని మోదీని సమాధానం చెప్పించాలని నిర్ణయించుకున్నాయి. ఎందుకంటే అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడితే లోక్సభలో అధ్యక్షుడిగా ప్రధాని నరేంద్ర మోదీ దానికి సమాధానం చెప్పాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే అవిశ్వాస తీర్మానం అస్త్రాన్ని విపక్షాలు ఉపయోగించుకున్నాయి. అయితే అధికార ఎన్డీఏ కూటమికి లోక్సభలో పూర్తి మెజార్టీ ఉంది. అటు.. విపక్షాల కూటమి ఇండియాకు కేవలం 144 మంది సభ్యులు మాత్రమే ఉన్నారు.