తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు దగ్గరికొస్తున్న నేపథ్యంలో బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, కార్యకర్తలతో బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా వారికి ఆయన పలు కీలక విషయాలను తెలియజేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకున్న చారిత్రక నిర్ణయాలను ప్రజల్లోకి మరింతగా తీసుకెళ్లాలని మంత్రి కేటీఆర్ సూచనలు చేశారు. ఇవి దేశంలో ఎప్పుడు కూడా లేని విధంగా ఉద్యోగుల పట్ల ఎంతో ఔదార్యంతో తీసుకున్న నిర్ణయాలని అన్నారు.
అందుకే రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజల్లోకి తమ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను తీసుకెళ్లాల్సిన బాధ్యత మనపై ఉందని పేర్కొన్నారు. ఇటీవల 21 వేల మందిని వీఆర్ఏలను రెగ్యులరైజ్ చేయడం.. అలాగే తాజాగా 43 వేల మంది ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి రాష్ట్ర ప్రభుత్వం మానవీయతను చాటుకుందని వ్యాఖ్యానించారు. ఇందుకోసం రాష్ట్రంలో ఉన్న అన్ని బస్సు డిపోల ముందు ఆర్టీసీ ఉద్యోగులతో కలిసి సంబరాలు చేయాలని పార్టీ నేతలు, శ్రేణులకు పిలుపునిచ్చారు. అలాగే అటు వీఆర్ఏల కుటుంబాలు.. ఇటు ఆర్టీసీ ఉద్యోగుల కుటుంబాలతో ఆత్మీయ సమావేశాలు ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ మేరకు ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇంఛార్జిలకు దిశానిర్దేశం చేశారు.
ఇదిలా ఉండగా ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడంపై కాంగ్రెస్ పార్టీ కూడా స్పందించింది. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో వీలినం చేస్తామని హామీ ఇచ్చామని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. అందుకోసమే సీఎం కేసీఆర్ వారిని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని నిర్ణయం తీసుకున్నారని.. ఇది కాంగ్రెస్ విజమయని పేర్కొన్నారు.