మణిపూర్‌లో ఘటనపై తెలంగాణ సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ స్మితా సబర్వాల్ నాలుగు రోజుల క్రితం ఓ ట్వీట్ పెట్టారు. చరిత్రలో ఎలాంటి కలహాలు జరిగినా మహిళలు నీస్సహాయ స్థితిలో నిలుస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేసారు. మణిపూర్‌లో భయంకర హింసకాండలో నిస్సహాయులైన అమాయక మహిళలను ఊరేగిస్తూ వారిపై అత్యాచారం చేశారన్నారు. ఈ ఘటన మన మూలాలను కదిలిస్తోందని, ఇంత జరుగుతుంటే మీడియా ఏం చేస్తుందని స్మితా సబర్వాల్ ప్రశ్నించారు.
ఆమె పెట్టిన ట్వీట్‌కు తాజాగా.. బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు కౌంటర్ ఇచ్చారు. నల్గొండ జిల్లాలో దళిత మహిళపై ఓ సర్పంచ్ రక్తం వచ్చేలా దాడి చేశాడని.. ఈ ఘటనకు సంబంధించి స్మితా సబర్వాల్ స్పందించాలని ఆయన డిమాండ్ చేశారు. “బీజేపీ పాలిత రాష్ట్రాల ఘటనలపై సత్వరమే స్పందిస్తూ ట్విట్లు పెట్టే.. స్మితా సబర్వాల్ గారు మీరు బాధ్యతలు నిర్వర్తిస్తున్న తెలంగాణ రాష్ట్రంలో జరిగిన ఈ దుర్ఘటనపై కూడా స్పందించాలని కోరుకుంటున్నాం.” అని ఆయన ట్వీట్ చేశారు.
స్మితా సబర్వాల్ వ్యవహారశైలిపై పలువురు నెటిజన్లు కూడా భిన్నంగా స్పందిస్తున్నారు. ఆమె వ్యవహారశైలి రాజకీయ నాయకురాలిగా ఉందని విమర్శిస్తున్నారు. నల్గొండ ఘటనపై స్మితా ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నిస్తున్నారు.