రాజన్న సిరిసిల్ల జిల్లాలో విషాదం
రాజన్న సిరిసిల్ల జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. యూట్యూబ్ వీడియోలు చూస్తూ.. ఉరిబిగుసుకొని ఓ ఆరో తరగతి విద్యార్థి ప్రాణాలు కోల్పోయాడు. అయితే చిన్నారి ఆత్మహత్యకు యత్నించాడా ? లేక ప్రమావశాత్తు ఉరి బిగిసుకుందా ? అనేది తెలియాల్సి ఉంది. వివరాల్లోకి వెళితే.. సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం కిష్టునాయక్ తండాకు చెందిన ప్రశాంత్, వనిత దంపతులకు ఇద్దరు సంతానం. పెద్ద కుమారుడు ఉదయ్ (11) ఆరో తరగతి చదువుతున్నాడు. శనివారం రాత్రి (జులై 22న) భోజనం చేసిన తర్వాత ఉదయ్.. యూట్యూబ్‌లో వచ్చే సరదా సన్నివేశాలు చేస్తూ గదిలోకి వెళ్లి తలుపులు పెట్టుకున్నాడు.
ఎంతసేపటికి తలుపులు తీయకపోవటంతో తల్లిదండ్రులు తలుపుతట్టి చూశారు. అయినా స్పందన లేకపోవటంతో ఆందోళనకు గురైన పేరెంట్స్ తలుపులు బద్దలుకొట్టారు. అయితే అప్పటికే గోడకు ఉన్న మేకకు లుంగీతో ఉరి వేసుకుని ఉదయ్ కనిపించాడు. అది చూసి షాక్‌కు గురైన తల్లిదండ్రులు.. వెంటనే చిన్నారిని కిందకు దింపారు. కొన ఊపిరితో ఉన్న ఉదయ్‌ను ఏడుస్తూనే మండల కేంద్రంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లారు.
పరీక్షించిన వైద్యులు చిన్నారి ప్రాణాలు కోల్పోయినట్లు వెల్లడించారు. దీంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. వారు రోధించిన తీరు అక్కడున్న వారిచే కంటతడి పెట్టించింది. చిన్నారి మృతిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సిరిసిల్లా ఏరియా ఆసుపత్రికి తరలించారు.