చంద్రుడిపై పరిశోధనలకుగానూ ప్రయోగించిన ‘చంద్రయాన్-3’ వ్యోమనౌక.. లక్ష్యం దిశగా సాగిపోతోంది. ఇప్పటివరకు మూడో కక్ష్యలో భూమిచుట్టూ చక్కర్లు కొట్టిన ఈ వ్యౌమనౌకకు సంబంధించిన నాలుగో కక్ష్య పెంపును అంతరిక్ష పరిశోధన సంస్థ గురువారం విజయవంతంగా నిర్వహించింది.
దీనితో భూ కక్ష వీడుతూ ఇక చంద్రయాన్ 3 వ్యోమనౌక చంద్రుడి వైపు ప్రయాణంలో మరో అడుగు ముందకేసినట్లు అయింది. తరువాతి జ్వలన ప్రక్రియ ఈ నెల 25న మధ్యాహ్నం రెండు మూడు గంటల మధ్య నిర్వహిస్తారు. చంద్రుడివైపు పయనంలో ఓ అడుగు ముందుకేసి ఇస్రో ఇప్పుడు
అంతర్జాతీయ చంద్రుడి దినోత్సవంలో ప్రతీకాత్మకంగా పాల్గొందని ఇస్రోవర్గాలు హర్షం వ్యక్తం చేశాయి.
అంతకు ముందు స్పేస్ సైన్స్ టెక్నాలజీ అండ్ అవేర్‌నెస్ ట్రైనింగ్ (స్టార్ట్) కార్యక్రమంలో ఇస్రో ఛైర్మన్ ఎస్ సోమనాథ్ మాట్లాడారు. చంద్రయాన్ సజావుగా సాగుతోందని , మరికొద్దిరోజులలో ఇది చంద్రుడిపై వాలుతుందని తెలిపారు. శాస్త్రీయ అంశాలకు సంబంధించి ఇస్రో చంద్రయాన్ 3 అత్యంత ప్రత్యేకమైన ఫలితాలను ప్రపంచానికి అందిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.