AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

పొంగులేటిపై బీజేపీ ఫోకస్‌..

కీలక హామీలు ఇచ్చిన జాతీయ నాయకత్వం?
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బీజేపీకి బలమైన నాయకత్వం లేదు. అయితే బీఆర్‌ఎస్‌ నాయకత్వంపై అసంతృప్తితో ఆ పార్టీకి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసిన పొంగులేటి శ్రీనివాసరెడ్డి.. ఏ పార్టీలో చేరతారనే దానిపై ఇప్పటివరకు క్లారిటీ ఇవ్వలేదు. ఈ ఏడాది చివర్లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాగైనా విజయం సాధించాలని భావిస్తున్న బీజేపీ ఇందుకోసం ఉన్న ఏ ఒక్క అవకాశాన్ని కూడా వదులుకోకూడదని నిర్ణయించుకుంది. పలు జిల్లాల్లో పార్టీకి బలమైన నేతలు, కేడర్‌ లేకపోవడం ప్రతికూలమైన అంశంగా మారింది. ఈ విషయాన్ని గ్రహించిన జాతీయ నాయకత్వం.. బలమైన నేతలను తమ వైపు ఆకర్షించేందుకు తీవ్రంగానే ప్రయత్నాలు చేస్తోంది. పలువురు నేతలను తమ పార్టీలోకి తీసుకొచ్చేందుకు వారితో చర్చలు జరుపుతోంది. పార్టీలోకి వచ్చేందుకు వాళ్లు పెడుతున్న హామీలకు కూడా అంగీకరించేందుకు బీజేపీ నాయకత్వం సిద్ధమవుతున్నట్టు సమాచారం. ఈ క్రమంలోనే ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డిపై బీజేపీ జాతీయ నాయకత్వం ఫోకస్‌ చేసినట్టు వార్తలు వస్తున్నాయి.

బీఆర్‌ఎస్‌కు దూరమని ప్రకటించిన పొంగులేటి… ఏ పార్టీలో చేరాలనే అంశాన్ని మాత్రం ఇంకా తేల్చుకోలేదని తెలుస్తోంది. ఆయనకు బీజేపీ , కాంగ్రెస్‌ , వైఎస్‌ఆర్‌టీపీ నుంచి ఆహ్వానాలు ఉన్నాయి. ఇప్పటికే ఆయన షర్మిల, విజయమ్మతో చర్చలు జరిపి.. తాను షర్మిల పార్టీ వైపు మొగ్గు చూపుతున్నట్టు సంకేతాలు కూడా ఇచ్చారు. మరోవైపు పొంగులేటితో తమ పార్టీ నేతలు చర్చలు జరుపుతున్నారని స్వయంగా టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డి వ్యాఖ్యానించారు. మరోవైపు బీజేపీ కూడా పొంగులేటిని తమ గూటికి తీసుకురావాలని భావించింది. ఈ క్రమంలో పొంగులేటిని ఒప్పించి బీజేపీలోకి తీసుకొచ్చేందుకు ఆ పార్టీ జాతీయ నాయకత్వం రంగంలోకి దిగిందనే టాక్‌ నడుస్తోంది.

పార్టీలోకి వస్తే ఆయనకు ఇచ్చే ప్రాధాన్యత, సీట్లకు సంబంధంచి ముందుగానే స్పష్టమైన హామీ ఇవ్వడంతో పాటు ఆయన అనుచరులకు కూడా పోటీ చేసే అవకాశం కల్పిస్తామని బీజేపీ నేతలు హామీ ఇచ్చినట్టు ప్రచారం సాగుతోంది. మొత్తానికి బీఆర్‌ఎస్‌కు దూరంగా ఉంటున్న పొంగులేటి.. ఏ పార్టీలోకి వెళతారన్నది ప్రస్తుతానికి సస్పెన్సే.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10