గమ్యానికి చేరుకున్న ఓ చిన్న విమానం ల్యాండింగ్ సమయంలో పైలట్ (Pilot) అస్వస్థతకు గురయ్యారు. దీంతో అందులోని మహిళా ప్రయాణికురాలు (Women Passenger) ఆ విమానాన్ని నియంత్రణలోకి తీసుకుని, సురక్షిత ల్యాండింగ్‌కు ప్రయత్నించారు. అయితే, ఈ సమయంలో విమానం అది రన్‌వేకు బయట కూలిపోయింది. దీంతో తక్షణమే అక్కడకు చేరుకున్న ఎమర్జెన్సీ రెస్క్యూ టీం.. పైలట్ తోపాటు ఆ మహిళను బయటకు తీసి ఆస్పత్రికి తరలించారు. పైలట్ ఆరోగ్యం విషమంగా ఉన్నట్లు సమాచారం. మహిళ మాత్రం స్వల్పగాయాలతో బయటపడింది. ఈ ఘటన అమెరికాలోని మసాచుసెట్స్‌లోని విన్‌యార్డ్ ఎయిర్‌పోర్ట్‌లో చోటుచేసుకుంది.
మసాచుసెట్స్ పోలీసుల కథనం ప్రకారం.. ‘న్యూయార్క్‌లోని వెస్ట్‌చెస్టర్ కౌంటీ నుంచి 2006 పైపర్ మెరీడియన్ విమానం విన్‌యార్డ్‌కు బయలుదేరింది.. విన్‌యార్డ్ విమానాశ్రయంలో ల్యాండ్ అవుతున్న సమయంలో పైలట్ (79) తీవ్ర అస్వస్థతకు గురయ్యారు… దీంతో అందులో ఉన్న మహిళా ప్రయాణికురాలు విమానాన్ని తన కంట్రోల్‌లోకి తీసుకున్నారు.. ఈ క్రమంలో విమానం సేఫ్ ల్యాండింగ్ కోసం ప్రయత్నిస్తుండగా.. రన్‌వే సమీపంలోనే పక్కకు ఒరిగిపోయి స్వల్పంగా దెబ్బతింది.. పైలట్‌తోపాటు అందులోని మహిళను బయటకు తీసి ఆస్పత్రికి తరలించాం.. విమానం ఎడమ రెక్క సగానికి విరిగిపోయింది’ అని తెలిపారు.









