AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

మహారాష్ట్ర నుంచి లోక్‌సభ బరిలో కేసీఆర్? .. కీలక నిర్ణయం దిశగా అడుగులు

జాతీయ మీడియాలో జోరుగా కథనాలు
బీఆర్‌ఎస్‌ పార్టీలో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నట్లు తెలుస్తోంది. పార్టీ విస్తరించడంలో భాగంగా సీఎం కేసీఆర్‌ కీలక నిర్ణయం దిశగా అడుగులు వేస్తున్నట్లు పార్టీ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో మహారాష్ట్ర నుంచి పోటీ చేసేందుకు సీఎం కేసీఆర్‌ వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నట్లు పార్టీ వర్గాలే చెబుతున్నాయి. రానున్న పార్లమెంట్‌ ఎన్నికల్లో మెదక్‌తో పాటు మహారాష్ట్రలో తెలంగాణ సరిహద్దులోని ఏదైనా లోక్‌సభ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగాలని భావిస్తున్నారట. దీని వల్ల బీఆర్‌ఎస్‌ గురించి జాతీయ స్థాయిలో చర్చ జరుగుతోందని, తద్వారా పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లవచ్చనేది గులాబీ బాస్‌ వ్యూహంగా జాతీయ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి.

గత ఎన్నికల్లో రాహుల్‌ గాంధీ కేరళలోని వయనాడ్‌ నుంచి ఎంపీగా గెలిచారు. గతంలో ఇందిరాగాంధీ తన సొంత నియోజకవర్గమైన రాయ్‌బరేలీని వదులుకుని మెదక్‌ నుంచి ఎంపీగా విజయం సాధించారు. గతంలో చాలామంది పాపులర్‌ నేతలు తమ సొంత రాష్ట్రం నుంచి కాకుండా వేరే రాష్ట్రాల నుంచి ఎంపీగా బరిలోకి దిగారు. తమ పార్టీని వేరే రాష్ట్రాల్లో కూడా బలోపేతం చేయడం, శ్రేణుల్లో ఉత్సాహం నింపేందుకు ఇలా నేతలు వేరే రాష్ట్రాల నుంచి పోటీ చేశారు. ఇప్పుడు కేసీఆర్‌ కూడా అదే ప్లాన్‌ను అమలు చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. అందుకే మహారాష్ట్ర నుంచి ఎంపీగా బరిలోకి దిగాలని యోచిస్తున్నట్లు పార్టీలో జోరుగా చర్చ జరుగుతోంది.

గతంలో తెలంగాణ ఉద్యమం సమయంలో కేసీఆర్‌ కరీంనగర్, మెదక్, మహబూబ్‌నగర్‌ స్థానాల నుంచి ఎంపీగా పోటీ చేశారు. దీని ద్వారా పార్టీని విస్తరించుకోవడంతో పాటు తెలంగాణ ఉద్యమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లారు. ఇప్పుడు మహారాష్ట్ర నుంచి కేసీఆర్‌ పోటీ చేయడం వల్ల అక్కడ పార్టీకి మైలేజ్‌ పెరగడంతో పాటు బీఆర్‌ఎస్‌ గురించి ప్రజల్లో చర్చ జరుగుతుంది. మహారాష్ట్ర నుంచి పోటీ చేయడంపై ఇప్పటికే జాతీయ స్థాయిలో పేరున్న పలు సర్వే సంస్థలతో కేసీఆర్‌ సర్వే చేయించుకున్నారట. మహారాష్ట్రతో పాటు కర్ణాటక, ఆంధప్రదేశ్, తమిళనాడు, మధ్యప్రదేశ్‌లో బీఆర్‌ఎస్‌ నుంచి అభ్యర్థులు పోటీ చేయడానికి ఎక్కడ అనుకూల పరిస్థితులు ఉన్నాయనేది సర్వే రిపోర్టుల ద్వారా కేసీఆర్‌ అంచనా వేసుకుంటున్నారని టాక్‌.

లోక్‌సభ ఎన్నికల్లో ఇతర రాష్ట్రాల్లో అభ్యర్థులను పోటీలోకి దింపేందుకు బలమైన వ్యక్తులతో పాటు పలువురు సెలబ్రెటీలతో కేసీఆర్‌ చర్చలు జరుపుతున్నారు. తమిళనాడు నుంచి స్టార్‌ హీరో విజయ్‌ను పోటీ చేయించాలని చూస్తున్నారు. గత ఏడాది మే నెలలో విజయ్‌ను కేసీఆర్‌ కలిశారు. ఇక గత ఎన్నికల్లో బెంగళూరు నుంచి బరిలోకి దిగిన సినీ నటుడు ప్రకాష్‌ రాజ్‌ను బీఆర్‌ఎస్‌ టికెట్‌పై పోటీ చేయించే అవకాశముంది.

ANN TOP 10