AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

చంద్రయాన్‌-3 ప్రయోగానికి ముహూర్తం ఎలా నిర్ణయించారో తెలుసా?

సాధారణంగా పంచాంగాలు, క్యాలెండర్లు అన్నీ చంద్రుడి గమనం ఆధారంగా లెక్కిస్తారు. అంటే ముహుర్తాలన్నీ చంద్రుడి చుట్టూనే తిరుగుతాయి. అయితే చంద్రుడి మీదకు వెళ్లే ప్రయాణానికి ఏ లెక్కన ముహూర్తం పెడతారో తెలుసా? అంతరిక్ష ప్రయాణం అంటే భూమి గురుత్వాకర్షణను అధిగమించి పైకి వెళ్లాలి. అంతరిక్షంలోకి శాటిలైట్లను ప్రవేశ పెట్టే రాకెట్లు లాంచింగ్ ప్యాడ్ నుంచి ఆకాశంలోకి వలయాకార మార్గంలో వెళ్లి నిర్ధిష్ట కక్ష్యలో వాటిని ప్రవేశ పెడతాయి. అయితే గ్రహాంతర ప్రయోగం కొంచెం ఢిఫరెంట్ గా ఉంటుంది. ఎందుకంటే భూమి మనకు స్థిరంగా ఉన్నట్లు అనిపిస్తుంది. భూమ్మీద నుంచి అంతరిక్షంలో భూకక్ష్యలోకి వెళ్లడం వరకూ కొన్ని పరిస్థితులు పరిగణనలోకి తీసుకోవాలి. ప్రయోగతేదీ నాటి వాతావరణ పరిస్థితులతో పాటు, సౌర కుటుంబంలో భూమి ఉన్న స్థానం, చంద్రుడు ఉన్న స్థానాలను బట్టి ఖగోళ దూరాలను లెక్కించుకోవాలి. భూమి చుట్టూ తిరుగుతూ క్రమంగా తన అపోజీని పెంచుకునే చంద్రయాన్ 3.. భూ గురుత్వాకర్షణ పరిధిని దాటి చంద్రుడి వైపు ఎప్పుడు ప్రయాణం ప్రారంభించాలి అన్నది కూడా చంద్రుడి స్థానాన్ని బట్టి నిర్ణయిస్తారు. ఇవన్నీ ఖగోళ పరంగా లెక్కించిన తర్వాతే. చంద్రయాన్ 3 కి ప్రయోగానికి ముహుర్తం నిర్ణయించారు.

మొత్తం 48 రోజుల ప్రయాణం తర్వాత చంద్రయాన్ 3.. ఆగస్ట్ 23 లేదా ఆగస్ట్ 24న చంద్రుడి దక్షిణ దృవం మీద మీద ల్యాండయ్యేలా ల్యాండర్‌ని ప్రయోగిస్తామని ఇస్రో తెలిపింది. లేని పక్షంలో మరో నెల రోజుల తర్వాత ల్యాండింగ్‌కు ప్రయత్నిస్తామని తెలిపారు. అయితే చంద్రుడి దశలను బట్టి దాని మీద ల్యాండర్‌ను దింపాల్సి ఉంటుంది. ఎందుకంటే చంద్రుడి మీద దిగి పరిశోధనలు చేసే ల్యాండర్, రోవర్ మాడ్యూల్ పనిచేయడానికి పవర్ కావాలి. ఆ పవర్.. సోలార్ ప్లేట్ ల నుంచి మాత్రమే ల్యాండర్, రోవర్లు పొందగలుగుతాయి. అంటే ల్యాండర్ దిగే సమయానికి అక్కడ సూర్యరశ్మి ఉండాలి. అంటే చంద్రుడి మీద పగలు ప్రారంభమయ్యే సమయానికి ల్యాండింగ్ జరగాలి. భూమి మీద ఒక రోజుకి, చంద్రుడి మీద ఒక రోజుకు చాలా తేడా ఉంటుంది. చంద్రుడి మీద ఒక రోజు అంటే అది భూమి మీద దాదాపు 29 రోజులకు సమానం. అంటే చంద్రుడి మీద ఒక పగలు అంటే దాదాపు 14 రోజులు. ఆ 14 రోజులు మాత్రమే అక్కడ సూర్యకాంతి లభిస్తుంది. అంటే ఆ 14 రోజులు మాత్రమే ల్యాండర్, రోవర్లకు కావాల్సిన సౌరశక్తి అందుతుంది. అందుకే చంద్రుడిపైకి పంపుతున్న ల్యాండర్, రోవర్ల జీవిత కాలం కేవలం 14 రోజులే అని ఇస్రో తెలిపింది.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10