AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

రాష్ట్రంలో కుక్కల పాలన..

జరిగింది ఒకటైతే.. చెబుతున్నది మరొకటి
టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి ఫైర్‌

హైదరాబాద్‌: తెలంగాణలో కుక్కల దాడి ఘటనలపై టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డి స్పందించారు. నగరంలో పాలన కుక్కలు బాలుడిపై దాడి చేసి చంపేవరకు వచ్చిందని విమర్శించారు. ‘బాలుడు కుటుంబాన్ని ఆదుకోకుండా సారీ చెప్పి చేతులు దులిపేసుకున్నారు. కుక్కలకు ఆకలి వేసి బాలుడిని తిన్నాయని మేయర్‌ అంటున్నారు. మంత్రి ఏమో కుక్కలకు కు.ని ఆపరేషన్‌ చేయిస్తామంటాడు. జరిగింది ఒకటైతే.. ప్రజాప్రతినిధులు చెబుతున్నది మరొకటి’ అని రేవంత్‌ రెడ్డి పేర్కొన్నారు.

‘చిన్నారిని కుక్కలు చంపిన ఘటనపై సారీ చెప్పడం సిగ్గుచేటు. బీఆర్‌ఎస్‌ పాలన.. కుక్కల పాలన.. మనుషులు చనిపోతే కుక్కలకు కు.ని ఆపరేషన్‌ ఏంటి? మున్సిపల్‌ శాఖ మంత్రిగా కేటీఆర్‌ విఫలమయ్యారు. అంబర్‌పేటలో వీధి కుక్కలకు బలై నాలుగేళ్ల బాలుడు చనిపోతే మానవత్వం లేకుండా ప్రభుత్వం వ్యహరిస్తోంది. రోడ్డు మీద కుక్కలు మనుషులను పీక్కు తినే పరిస్థితి కేసీఆర్‌ ప్రభుత్వంలో వచ్చింది. ప్రదీప్‌ కుటుంబానికి నష్టపరిహారం ప్రకటించాలి’ అని రేవంత్‌ రెడ్డి తెలిపారు.

‘ప్రదీప్‌ కుటుంబంపై కనీసం సానుభూతి కూడా ప్రభుత్వం చూపడం లేదు. సారీ చెప్పి చేతులు దులిపేసుకున్నారు. కేటీఆర్‌ ఆ కుటుంబానికి ఆదుకోవాలి’ అని రేవంత్‌ రెడ్డి డిమాండ్‌ చేశారు. హైదరాబాద్‌లో కుక్కలు స్వైరవిహారం చేస్తున్నాయి. రోడ్డుపై ఆడుకుంటున్న చిన్నారులపై దాడి చేస్తున్నాయి. అంబర్‌పేటలో రోడ్డుపై ఆడుకుంటున్న నాలుగేళ్ల బాలుడు ప్రదీప్‌ కుక్కల దాడి ఘటనలో మృతి చెందిన ఘటన మరువకముందే.. రాష్ట్రవ్యాప్తంగా బుధవారం ఇలాంటి ఘటనలు పలుచోట్ల జరిగాయి. హైదరాబాద్‌లో రుషి అనే బాలుడు కుక్కల దాడిలో గాయపడగా.. ఆస్పత్రికి తరలించారు. అలాగే కరీంనగర్‌లో మూడు ఘటనలు ఇలాంటివి చోటుచేసుకున్నాయి.

ANN TOP 10