వలస పులులను మానిటర్ చేసేందుకు అటవీశాఖ కొత్త ఫ్లాన్ తో రంగంలోకి దిగింది. నిత్యం తిప్పేశ్వర్ అభయారణ్యం నుంచి వలస వస్తున్న పులుల సంచారం నేపథ్యంలో ఆదిలాబాద్ జిల్లా లోని పెనుగంగా సమీపంలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసింది. వలస పులుల రాకను ముందే పసిగట్టి సమీప గ్రామాల ప్రజలను ముందస్తుగా అలర్ట్ చేసే విధంగా ఈ సీసీ కెమెరాలను వినియోగించుకోనుంది. గతంలో తిప్పేశ్వర్ నుంచి పెనుగంగ దాటి ఆదిలాబాద్ కు వలస వచ్చిన పులి.. పిల్లలతో సహా పెనుగంగా సమీప గ్రామాల్లో సంచరిస్తూ భయబ్రాంతులకు గురి చేయడంతో మరోసారి అలాంటి పరిస్థితులు ఉండకుండా పులుల నుంచి గ్రామస్తులకు.. వేటగాళ్ల నుంచి పులులకు ప్రాణ హాని జరగకుండా పెను గంగా తీరం వెంట ఇలా సీసీ కెమెరాలను అమర్చింది. ఇప్పటికే అటవి ప్రాంతాల్లో పులుల సంచారాన్ని ట్రాక్ చేసేందుకు ట్రాప్ కెమెరాలను బిగించగా.. ఈ సీసీ కెమెరాల ఏర్పాటుతో మరింతగా వలస పులులను గుర్తించ వచ్చని బావిస్తోంది అటవీశాఖ.
పెనుగంగా తీరం వెంట తాంసి ( కె ), పిప్పల్ కోటి రిజర్వాయర్ వద్ద ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను నేరుగా జిల్లా కేంద్రంలోని అటవిశాఖ కార్యాలయానికి అనుసంధానం చేసింది. ఈ సీసీ కెమెరాలు సోలార్ ఎనర్జీ తో పని చేస్తాయని.. వీటి సాయంతో పులుల రాకపోకలను ఈజీగా మానిటర్ చేసే అవకాశం ఉంటుందని అటవీశాఖ అదికారి ఒకరు తెలిపారు. తరచుగా పెన్ గంగ దాటి వస్తున్న పులులతో… పెనుగంగా అటవి సమీప ప్రాంతాల ప్రజలను అలర్ట్ చేసేందుకు ఈ సీసీ కెమెరాలు ఉపయోగపడుతాయని.. కిలో మీటర్ మేర విజువల్స్ ను క్యాప్చర్ చేస్తాయని తెలిపింది ఆదిలాబాద్ అటవిశాఖ.









