ఎన్నికలు దగ్గరికొస్తున్న నేపథ్యంలో బీజేపీ తెలంగాణపై ఫోకస్ పెట్టింది. ఇటీవల ప్రధానీ నరేంద్ర మోదీ వచ్చి రూ.6 కోట్ల ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు తాజాగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా కూడా తెలంగాణ బాట పట్టనున్నారు. జులై 29 న ఖమ్మంకు అమిత్ షా రానున్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. వివరాల్లోకి వెళ్తే గత నెల 15న ఖమ్మంలో బీజేపీ బహిరంగ సభ నిర్వహించాలనుకుంది. కానీ బిపోర్‌జాయ్ తుఫాను సహా పలు కారణాల వల్ల ఆ సభ వాయిదా పడింది. అయితే ఇప్పుడు ఆ సభ నిర్వహించేందుకు జులై 29న ముహుర్తం ఖరారైంది.
మరోవైపు ఆగస్టు 16 నుంచి తెలంగాణలోని 119 నియోజక వర్గాలకు ఇంఛార్జీలుగా వివిధ రాష్ట్రాల నుంచి 119 ఎమ్మెల్యేలు రానున్నట్లు తెలుస్తోంది. వారం రోజుల పాటు నియోజకవర్గాల్లోనే వారు మకాం వేయనునన్నట్లు సమాచారం. డబుల్ బెడ్రూం, రేషన్ కార్డ్, రైతు రుణ మాఫీ, ధరణి సమస్యలు వంటి స్థానిక సంస్థల మీద ప్రత్యేక కార్యాచరణతో ప్రజల ముందుకు వెళ్లేందుకు ప్రణాళిక చేసేందుకు సిద్ధమవుతుట్లు ప్రచారం జరుగుతోంది. అలాగే ప్రతి నియోజకవర్గాల్లో సభలు కూడా నిర్వహించనున్నట్లు తెలుస్తోంది.









