తమిళనాడులోని అరుణాచలేశ్వరుని గిరిప్రదర్శన చేయాలనుకునే భక్తుల సౌకర్యార్థం ప్రతి పౌర్ణమికి ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేయాలని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TSRTC) నిర్ణయించింది. గురు పౌర్ణమి సందర్భంగా జూలై 3న గిరి ప్రదర్శనకు తొలిసారిగా నడిపిన సూపర్ లగ్జరీ బస్సులకు భక్తుల నుంచి మంచి స్పందన రావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించింది.
ప్రతి నెలలోని పౌర్ణమికి రద్దీని బట్టి హైదరాబాద్‌తో సహా అన్ని జిల్లా కేంద్రాల నుంచి ప్రత్యేక సర్వీసులను నడిపేలా ఏర్పాట్లు చేయనున్నట్టు వివరించింది. అరుణాచలేశ్వరుని గిరి ప్రదర్శన ప్రారంభమయ్యే 4 గంటల ముందుగానే భక్తులను అక్కడికి చేర్చనుంది. ప్రతి పౌర్ణమికి 10 రోజుల ముందుగా ఆన్లైన్లో ఈ అరుణాచల గిరి ప్రదర్శన బస్సు టికెట్లు భక్తులకు అందుబాటులో ఉంటాయి.
హైదరాబాద్ తో పాటు జిల్లా కేంద్రాల నుంచి ప్రత్యేక బస్సులు బయలుదేరుతాయి. ఆంధ్రప్రదేశ్ కాణిపాకంలోని విఘ్నేశ్వరుని దర్శనానంతరం అరుణాచలానికి చేరుకుంటాయి. గిరి ప్రదర్శన పూర్తయిన తర్వాత అదే రోజు సాయంత్రం వెల్లూరులోని గోల్డెన్ టెంపుల్ కు వెళ్తాయి. అక్కడ దర్శనానంతరం తిరుగుపయనమవుతాయి.









