AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

ఎమ్మెల్సీ కౌశిక్‌ రెడ్డి కారుకూ స్పీడెక్కువ

హైదరాబాద్‌: నోటికి పని చెప్పే నేతలకు పదవులు అప్పజెప్పే ధోరణి ఎక్కువైంది. దీంతో.. దూకుడుగా మాట్లాడే ధోరణిని పెంచుకుంటున్నారు. అలాంటి నేతల్లో తెలంగాణ బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కౌశిక్‌ రెడ్డి ఒకరు. ఈ మధ్యన ఆయన రాష్ట్ర గవర్నర్‌ తమిళిసైను ఉద్దేశించి నోటికి వచ్చినట్లుగా మాట్లాడిన వైనంపై జాతీయ మహిళా కమిషన్‌ సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. ఆయన్ను తమ ముందుకు హాజరు కావాలని ఆదేశించటం తెలిసిందే.

ఎవరినైనా.. ఎంత మాట అయినా అనేసే కౌశిక్‌ రెడ్డి నోటికే కాదు.. ఆయన కారుకు కూడా పట్టపగ్గాల్లేకుండా దూసుకెళుతుందన్న విషయం తాజాగా బయటకు వచ్చింది. ఆయన కారుకు ఉన్న చలానాల్ని చూస్తే.. ఆయన కారుకు ఎంత దూకుడు ఎక్కువన్న విషయం ఇట్టే అర్థమవుతుంది. ఆయనకు చెందిన టయోటా ఇన్నోవా పెద్ద ఎత్తున చలానాలు పెండిరగ్‌ ఉన్న విషయం బయటకు వచ్చింది. ట్రాఫిక్‌ నిబంధనల్ని ఉల్లంఘిస్తూ దూసుకెళ్లే కౌశిక్‌ రెడ్డి కారు మీద ఏకంగా పదమూడు చలానాలు ఉన్నట్లుగా చెబుతున్నారు.

మితిమీరిన వేగం.. నో పార్కింగ్‌ వద్ద కారును నిలపటంతో పాటు.. స్టాప్‌ లైన్‌ క్రాసింగ్‌.. ఇలా పలు తప్పులు చేసిన నేపథ్యంలో ఆయన కారు మీద పదమూడు చలానాలు ఉండటమే కాదు.. వాటి విలువ రూ.12వేలకు పైనే ఉన్న విషయాన్ని గుర్తించారు. కౌశిక్‌ రెడ్డికి నోటికే కాదు ఆయన కారుకు కూడా స్పీడెక్కువన్న విషయం సోషల్‌ మీడియాలో ఆసక్తికర చర్చ నడుస్తోంది. ఈ స్పీడ్‌ కు కళ్లాలు వేయకుంటే కష్టాలు తప్పవన్న మాట వినిపిస్తోంది.

ANN TOP 10