అక్రమ ఆస్తులు నిరూపిస్తే స్టేషన్ ఘనపూర్ దళిత బిడ్డలకు రాసిస్తా
ముక్కు నేలకు రాసి బేషరతుగా క్షమాపణ చెప్పాల్సిందే
ఎమ్మెల్సీ కడియం శ్రీహరి తీవ్రస్థాయిలో మండిపాటు
ఎమ్మెల్యే రాజయ్య సభ్యత, సంస్కారం లేని వ్యక్తి అని ఎమ్మెల్సీ కడియం శ్రీహరి అన్నారు. స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే రాజయ్యపై ఎమ్మెల్సీ కడియం శ్రీహరి సోమవారం తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తనపై చేసిన విమర్శలకు గాను కౌంటర్ ఇచ్చారు. రాజయ్య తన కులాన్ని ప్రస్తావించారని, ఆస్తులు సంపాదించుకున్నట్లు ఆరోపించారని, అలాగే తాను ఎన్ కౌంటర్ సృష్టికర్తనని విమర్శలు చేశాడని ఆవేదన వ్యక్తం చేశారు. తనకు ఇతర పట్టణాల్లో, ఇతర దేశాల్లో ఆస్తులు ఉంటే, అందుకు సంబంధించి ఆధారాలు తీసుకు వస్తే తాను ఘనపూర్ దళిత బిడ్డలకు రాసిస్తానని సవాల్ చేశారు.
రాజయ్య గెలుపు కోసం తాను ఎంతో కృషి చేశానని, అయినా తనపై, తన కుటుంబంపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని, ఆయన వ్యాఖ్యలు బాధించాయన్నారు. ఈ విషయాన్ని గతంలోనే కేసీఆర్ దృష్టికి తీసుకు వెళ్లానని, సంయమనం పాటించమని కోరడంతో ఏం మాట్లాడలేదన్నారు. రాజయ్య తన స్థాయిని మించి మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. డాక్టర్ అయినా పరిణతి లేకుండా మాట్లాడటం ఏమిటన్నారు. తన కులం గురించి, తన కూతురు కులం గురించి మాట్లాడటంపై ఆవేదన వ్యక్తం చేశారు.
ఎక్కడైనా తండ్రి కులం పిల్లలకు వస్తుందని, తల్లి కులం కాదని, అదే చట్టం చెబుతోందన్నారు. భారతదేశ కుటుంబ వ్యవస్థ తల్లి, తండ్రి అని ఉంటుందని, కుటుంబ వ్యవస్థను అవమానించేలా రాజయ్య ప్రకటన ఉన్నందుకు వెంటనే మహిళలందరికీ ముక్కు నేలకు రాసి బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. తల్లి సత్యం.. తండ్రి అపోహ అంటున్నావ్.. నీవు చదివిన డాక్టర్ ఇదే నేర్పించిందా? ఇదేనా నీ సభ్యత? అని దుయ్యబట్టారు. నా తల్లి బీసీ, నా తండ్రి ఎస్సీ.. సుప్రీం తీర్పు ప్రకారం తాను ఎస్సీనని చెప్పారు. ఇంత దుర్మార్గపు ప్రకటన చేస్తారా? అన్నారు.









